టాలీవుడ్‌ ఫస్ట్‌ హాఫ్‌ రిపోర్ట్‌: హిట్టా.. ఫట్టా?

Tollywood 2018 First Half Report - Sakshi

ఒక బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. మరొక బంపర్‌ హిట్‌. చరిత్రలో నిలిచిపోయే ఒక క్లాసిక్‌ హిట్‌. మరికొన్ని సూపర్‌హిట్‌లు, ఇంకొన్ని యావరేజ్‌ మూవీలు, కొన్ని డిజాస్టర్‌లు.. ఈ ఏడాది ప్రథమార్థం టాలీవుడ్‌ ప్రస్థానం ఇలా సాగింది. లాస్ట్‌ పంచ్‌ మనదైతే దానికొచ్చే కిక్కే వేరప్పా.. అన్నట్లు ఈ ఏడాది సమర్లో, ప్రథమార్ధం చివర్లో వచ్చిన సినిమాలు ఇచ్చిన కిక్‌ను ఎప్పటికీ మరిచిపోలేరు సినీ అభిమానులు. ఈ ప్రథమార్దంలో టాలీవుడ్‌ పరిస్థితి ఏంటో ఓ సారి లుక్కేద్దాం. 

మరిచిపోలేని దెబ్బ...
ఈ ఏడాది ప్రారంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సినిమా కేవలం అభిమానులకే కాదు.. మొత్తం టాలీవుడ్‌కు మరిచిపోలేని దెబ్బ. ఈ సినిమా పేరేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే రికార్డులకు చిరునామాగా ఉంటుందని ఆశిస్తారు అభిమానులు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసి అతి పెద్ద డిజాస్టర్‌గా రికార్డుకెక్కింది. అజ్ఞాతవాసి చిత్రంతో తివిక్రమ్‌ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లాల్సివచ్చింది. పవన్‌ కూడా సినిమాలను వదిలేసి రాజకీయాల వైపు వచ్చేశారు.

ఈ దెబ్బను కొంతవరకు మరిపించే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. ‘జై సింహా’తో వచ్చి పర్వాలేదనిపించారు. మూస ధోరణి కథతో వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. అజ్ఞాతవాసి దారుణంగా బెడిసికొట్టడం.. పండుగ సీజన్‌ కావడం.. ఈ సినిమాకు కలిసొచ్చింది. అయితే టాలీవుడ్‌కు సంక్రాంతి సెంటిమెంట్‌ ఎప్పటినుంచో ఉంది. అయితే ఈ సంక్రాంతి మాత్రం ప్రేక్షకుల దాహాన్ని తీర్చలేకపోయింది. సరైన బ్లాక్‌బస్టర్‌ లేక సినీ అభిమానులు నిరాశ చెందారు. రంగుల రాట్నం, ఇగో చిత్రాలు వచ్చినట్టు కూడా తెలియలేదు. 

విజయానికి బాట వేసిన అనుష్క...

రిపబ్లిక్‌ డే కానుకగా వచ్చిన ‘భాగమతి’ సినిమా ప్రేక్షకులను మళ్లీ థియేటర్ల వైపు నడిపించింది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారి విజయాలు సాధిస్తున్న అనుష్క ఖాతాలో సూపర్‌హిట్‌గా నిలిచింది భాగమతి. హారర్‌, మెసెజ్‌ ఓరియెంటెడ్‌, అనుష్క అభినయం.. ఇలా సినిమాన హిట్‌ బాట పట్టించాయి. పిల్ల జమీందార్‌ సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ అశోక్‌ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. రికార్డుస్థాయి కలెక్షన్లు కాకపోయినా... హౌస్‌ఫుల్‌తో థియేటర్లు కలకలలాడాయి. 

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌...

చిన్న సినిమానే అయినా మెగాస్టార్‌ చిరంజీవిని రంగంలోకి దింపి ‘ఛలో’ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి హాజరవడమే ఈ సినిమా మొదటి సక్సెస్‌. నాగశౌర్య తన సొంత బ్యానర్‌పై చేసిన మొదటి ప్రయత్నమే భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. కామెడీకి పెద్ద పీట వేస్తూ.. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయింది. ఇక ఈ ఏడాదిలో బెస్ట్‌ సాంగ్స్‌ లిస్ట్‌ను తీయాల్సి వస్తే.. అందులో కచ్చితంగా ఈ సినిమాలోని చూసి చూడంగానే.. అనే పాట ఉండాల్సిందే. ఎందుకంటే అంతలా ఈ పాట యూత్‌కు దగ్గరైంది. మొదటి ప్రయత్నంలోనే డైరెక్టర్‌గా వెంకీ కుడుముల తన ప్రతిభను చాటుకున్నారు. 

ఇక ఇదే నెలలో వచ్చిన రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా వచ్చిన ‘హౌరాబ్రిడ్జ్‌’ ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా పోయింది. మోహన్‌బాబు మళ్లీ తమ కుటుంబ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాయత్రి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది దారుణంగా దెబ్బకొట్టింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌, మాస్‌ డైరెక్టర్‌ వి.వి వినాయక్‌ కాంబోలో వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమా ఇద్దరి కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా టాలీవుడ్‌కు ఫిబ్రవరిలో దెబ్బ మీద దెబ్బ పడుతుంటే.. మళ్లీ మెగా హీరో రూపంలోనే టాలీవుడ్‌ పైకి లేచింది. వరుణ్‌తేజ్‌ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమా హిట్‌గా నిలిచింది. వెంకీ అట్లూరి సినిమాను మలిచిన విధానం అందరికీ నచ్చింది. ఈ సినిమా క్లాస్‌ హిట్‌గా వరుణ్‌ కెరీర్‌లో స్థిరపడిపోయింది.

ఇక తరువాతి వరుసలో ఉన్న సినిమా.. నాని నిర్మాతగా వ్యవహరించి తీసిన ‘అ!’. ఈ సినిమా అందరికీ ఎక్కకపోవడంతో యావరేజ్‌ టాక్‌తో ఓ మోస్తరుగా నడిచింది. ఈ సినిమా ప్రశాంత్‌ వర్మకు దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చింది. చాలా కాలం తరువాత మళ్లీ తరుణ్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఇది నా లవ్‌ స్టోరీ’.. కానీ తన లవ్‌ స్టోరీ ఎవ్వరికీ నచ్చలేదు. తరుణ్‌ చేసిన ఈ ప్రయత్నం వృథాగా పోయింది. ఘట్టమనేని మంజుల దర్శకురాలిగా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. సందీప్‌ కిషన్‌, అమైరా దస్తుర్‌ జంటగా నటించిన ‘మనుసుకు నచ్చింది’ సినిమా ప్రేక్షకులకు నచ్చకుండాపోయింది. ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రచయిత’ సినిమా బాగానే ఉన్నా.. ఇలాంటి చిన్న సినిమాలకు ఆదరణ అంతగా ఉండదు. సోడా గోలిసోడా, చల్తే చల్తే, హైద్రాబాద్‌ లవ్‌స్టోరీ, జువ్వా, రా..రా.., ఏ మంత్రం వేశావే, ఐతే 2.0, దండుపాళ్యం 3, అనగానగా ఒక ఊళ్లో.. ఇలా హీరోలు ఎవరో కూడా తెలియని సినిమాలతో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వెలవెలబోయింది.

దీంట్లోనే ఒక ఆశాకిరణంలా.. నిఖిల్‌ ‘కిరాక్‌పార్టీ’ సినిమా వచ్చినా పార్టీ చేసుకుని ఆనందించేంతగా సినిమా మెప్పించలేకపోయింది. నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా వచ్చిన ‘ఎమ్మెల్యే’ సినిమా కాస్త పర్వాలేదనిపించినా.. రొటిన్‌ ఫార్మూలాతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా చేరుకోలేకపోయింది. కన్నడ రీమేక్‌గా రానా వాయిస్‌ ఓవర్‌తో సినిమాకు హైప్‌ తీసుకొచ్చినా.. ‘రాజారథం’ సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘నీదీ నాదీ ఒకే కథ’ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందింది. ఎంతైనా చిన్న సినిమా కాబట్టి దాని పరిధిలో విజయం సాధించింది. హీరోగా శ్రీవిష్ణు తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ సినిమా వచ్చిన సమయం మాత్రం కరెక్ట్‌ కాదేమో. అదే ఈ సినిమా ఇంకొంచెం ముందుగా వస్తే కలెక్షన్లు కూడా బాగానే వచ్చేవి. ఎందుకుంటే మార్చి చివరి నుంచి బాక్సాఫీస్‌పై కలెక్షన్ల సునామీ మొదలైంది. 

మార్చి చివర నుంచి టాలీవుడ్‌ అలుపెరుగకుండా రికార్డులను మార్చుకుంటూ ఉంది. మార్చి చివరి తేదీన వచ్చి ఏప్రిల్‌ మొత్తం కలెక్షన్ల తుఫాను తెచ్చింది రంగస్థలం. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం నాన్‌ బాహుబలి రికార్డులను నెలకొల్పింది. థియేటర్స్‌కు రిపిటెడ్‌ ఆడియెన్స్‌ను రప్పించడం కష్టమవుతున్న ఈ తరుణంలో ఇప్పటికీ ఈ సినిమా కొన్ని థియేటర్లలో నడుస్తోంది. ఇదంతా సుకుమార్‌ మాయ. రామ్‌చరణ్‌, సమంతల అద్భుతమైన నటన, దేవీ శ్రీప్రసాద్‌ అందించిన సంగీతం, 1980నాటి గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన రత్నవేలు.. ప్రతీ పాత్రకు జీవం పోసిన ఆయా నటీనటులు వెరసి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. 

ఈ ప్రవాహంలో వచ్చి కొట్టుకుపోయిన సినిమా ‘ఛల్‌ మోహనరంగా’. నితిన్‌ హీరోగా.. త్రివిక్రమ్‌, పవన్‌ కల్యాణ్‌ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు. ఈ సినిమా ఎంటర్‌టైనింగ్‌గా పర్వాలేదనిపించినా.. రిలీజ్‌ చేసిన టైమ్‌ కరెక్ట్‌ కాకపోయే సరికి.. ప్రేక్షకులకు ఎక్కలేదు. ఎందుకంటే అప్పటికే రంగస్థలం ఫీవర్‌తో టాలీవుడ్‌ ఊగిపోతూ ఉంది. రంగస్థలంతో చెర్రీ కొత్తగా ట్రై చేశాడని అందరూ చెప్పుకుంటూ ఉన్న ఆ తరుణంలో.. న్యాచురల్‌స్టార్‌గా.. చేసే ప్రతీ సినిమాలో కొత్త దనం ఉండేలా చూసుకుంటాడని పేరున్న నాని ‘కృష్ణార్జున యుద్దం’ లాంటి మూస ధోరణి సినిమాను చేసి దెబ్బతిన్నాడు. మొదటిసారిగా నానిపై విమర్శలు మొదలయ్యాయి. ఈ విధంగా రంగస్థలం ఎఫెక్ట్‌ నానిపై కూడా పడింది. 

ఇలా రంగస్థలం హవా కొనసాగుతూ ఉంటే.. దానికి అడ్డుకట్ట వేసే పనిని మహేష్‌ బాబు తీసుకునే ప్రయత్నం చేశాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన భరత్‌ అనే నేను సినిమా వచ్చి మళ్లీ టాలీవుడ్‌ రికార్డులకు పని చెప్పింది. కేవలం తెలుగులోనే కాక ఓవర్సిస్‌లో కూడా రికార్డులు పరిగెత్తేలా చేశాయి రంగస్థలం, భరత్‌ అనే నేను సినిమాలు. ఇవి రెండూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. దానికి తగ్గట్లే నిర్మాతలు కలెక్షన్లను ప్రకటించేవారు. ఇక సోషల్‌ మీడియాలో అభిమానుల హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందే. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్పంటూ.. ఇరు వర్గాల అభిమానులు దాడికి దిగడం జరిగింది. అయితే లాంగ్‌ రన్‌లో రంగస్థలం నెలకొల్పిన రికార్డులకు అతి చేరువలో భరత్‌ అనే నేను నిలవడం గమనార్హం. విచిత్రమేమిటంటే.. అమెజాన్‌ ప్రైమ్‌లో రంగస్థలం సినిమాను విడుదల చేసినా.. ఇంకా కొన్ని థియేటర్లరో విజయవంతంగా నడుస్తోంది. 

ఇలా ఈ రెండు సినిమాలు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ పనిపడుతుండగా.. ఆచారి అమెరికా యాత్ర, కణం, ఎందరో మహానుభావులు లాంటి సినిమాలు నిలవలేకపోయాయి. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా.. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం చేస్తూ.. వచ్చిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. పెద్దగా ప్రభవాన్ని చూపలేకపోయింది. వరుస విజయాలతో ఊపుమీదున్న అల్లు అర్జున్‌ కెరీర్‌లో యావరేజ్‌గా మిగిలిపోయింది.

టాలీవుడ్‌లో క్లాసిక్‌ హిట్‌..

రంగస్థలం, భరత్‌ అనే నేను రెండు సినిమాల వైపే జనం వెళ్తుండగా.. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన మహానటి సావిత్రి జీవిత గాథ ‘మహానటి’ సినిమాతో అందరినీ తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ ఏడాదిలోనే కాక.. టాలీవుడ్‌ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మహానటి అందరి మనుసుల్లో నిలిచిపోయింది. కీర్తి సురేశ్‌ మహానటి సావిత్రిగా అభినయించిన తీరుకు ప్రేక్షక లోకమే కాకుండా సెలబ్రెటీ ప్రపంచం కూడా స్తంభించిపోయి.. ప్రశంసల జల్లును కురిపించింది. తెలుగు తమిళ మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను తెరపై ఆవిష్కరించిన తీరుకు సినీలోకం ఆశ్చర్యపోయింది. ఇక బయోపిక్‌ చిత్రాలను తెరకెక్కించాలంటే మహానటి సినిమా ఓ నిఘంటువుగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే కొన్ని వివాదాలు చుట్టిముట్టినా...అవేవీ సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి. నేటికీ ఈ సినిమా థియేటర్స్‌లో విజయవంతంగా రన్‌ అవుతోంది. 

మూడు సినిమాల ప్రభంజనంలో...
రంగస్థలం, భరత్‌ అనే నేను, మహానటి సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని థియేటర్లలో పాగా వేసి కూర్చున్నాయి. అయితే వీటి తరువాత వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులకు చేరువ కాలేకపోయాయి. వచ్చినవి వచ్చినట్లు వెళ్లిపోయాయి. చాలా గ్యాప్‌ తరువాత పూరీ జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ను హీరోగా పెట్టి తీసిన సినిమా మెహబూబా. ఇది మళ్లీ తనకు కమ్‌బ్యాక్‌ మూవీ అవుతుందని పూరీ అభిప్రాయపడ్డారు కానీ.. ఈ సినిమా కూడా పూరికి ఏమాత్రం కలిసిరాలేదు. ఆర్‌ నారాయణ మూర్తి నటించిన అన్నదాత సుఖీభవ, రవితేజ నేల టిక్కెట్టు ఏ మాత్రం ప్రేక్షకులను థియేటర్ల వైపు వచ్చేలా చేయలేకపోయాయి. 

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే రామ్‌ గోపాల్‌ వర్మ, నాగార్జున కాంబినేషన్‌లో సినిమా అంటే అప్పుడెప్పుడో వచ్చి ట్రెండ్‌సెట్‌ చేసిన శివ సినిమా రేంజ్‌లో ఊహించుకుంటారు అభిమానులు. కానీ ఈ ఏడాది వచ్చిన ‘ఆఫీసర్‌’ సినిమా చూస్తే.. మళ్లీ వర్మ సినిమా అంటే ప్రేక్షకులు భయపడేలా చేశాడు. నాగార్జున కెరీర్‌నే దెబ్బకొట్టేంతగా బెడిసికొట్టింది ఈ సినిమా. కనీసం వారం తిరక్కముందే థియేటర్స్‌ నుంచి తీసేసే పరిస్థితి వచ్చింది. నాగశౌర్య ‘అమ్మమ్మ గారిల్లు’ ఓకే అనిపించగా, రాజ్‌ తరుణ్‌ ‘రాజుగాడు’ మళ్లీ బోర్‌ కొట్టించాడు. కళ్యాణ్‌ రామ్‌ కాస్త విభిన్నంగా ట్రై చేసిన ‘నా నువ్వే’ ప్రేక్షకులకు సరిగా కనెక్ట్‌ కాలేకపోయింది.

సమ్మోహితుల్ని చేస్తోన్న సినిమా...

ఇంద్రగంటి మోహన్‌కృష్ణ సినిమాలకు ఓ ప్రత్యేకస్థానం ఉంటుంది. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, జెంటిల్‌మెన్‌, అమీ తుమీ ఇలా ప్రతి సినిమాను ఓ ప్రత్యేకమైన శైలిలో తెరకెక్కించారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’.. నిజంగానే సినిమా చూసిన ప్రతిఒక్కరినీ సమ్మోహితుల్ని చేస్తోంది. సినిమాను తెరకెక్కించిన విధానం, హీరో హీరోయిన్ల నటన, సీనియర్‌ నటుడు నరేష్‌ పండించిన హాస్యం ఈ సినిమా విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా మాత్రమే ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. కమెడియన్‌ కమ్‌ హీరో అయిన శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా చేసిన చిత్రం జంబలకిడిపంబ.. అప్పటి మ్యాజిక్‌ను రిపీట్‌ చేయలేకపోయింది. 

ఈ ఏడాదిలోనే అత్యధికంగా జూన్‌ చివరి వారంలో దాదాపు పదకొండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ అందులో చెప్పుకోదగ్గవి ఓ రెండు మూడు సినిమాలే. పెళ్లి చూపులు సినిమా తరువాత తరుణ్‌ భాస్కర్‌ నుంచి మళ్లీ ఇంకో సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. పూర్తిగా కొత్త నటీనటులతో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంది. అయితే పెళ్లి చూపులు నాటి మ్యాజిక్ రిపీట్‌ కాలేదంటూ రివ్యూలు వస్తున్నాయి. అయితే ఇంకో రెండు వారాలు గడిస్తే కానీ ఈ సినిమా రిజల్ట్‌ ఏంటో చెప్పలేం. షకలక శంకర్‌ కమెడియన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న తరుణంలో హీరోగా మారి చేసిన చిత్రం ‘శంభో శంకర’. కానీ ఈ సినిమా శంకర్‌ను హీరోగా నిలబెట్టడంలో ఏమాత్రం సహాయపడలేదు.  

ఈ ప్రథమార్దంలో వచ్చిన డబ్బింగ్‌ చిత్రాల్లో అంతగా జోరు చూపించినవి రెండు సినిమాలే. అందులో ఒకటి సూపర్‌స్టార్‌ సినిమా ‘కాలా’, విశాల్‌ ‘అభిమన్యుడు’. కాలా సినిమా అంచనాలు అందుకోలేక చతికిలపడిపోయింది. కబాలి రేంజ్‌ కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. ఇక విశాల్‌ హీరోగా వచ్చిన అభిమన్యుడు విశాల్‌ సినీ కెరీర్‌లోనే అతి పెద్ద విజయం సాధించి, రికార్డు కలెక్షన్లు సాధించింది. డబ్బింగ్‌ సినిమా అయినా.. ఒరిజినల్‌ తెలుగు సినిమా రేంజ్‌లో కలెక్షన్లను సాధించింది. 

ఇలా ఈ ప్రథమార్దం.. టాలీవుడ్‌ ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. ఎంత పాతాళానికి తోసేసే సినిమాలు వచ్చినా.. ఆకాశంలో తారగా ఎప్పటికీ నిలిచిపోయే.. ఎప్పటికీ తలెత్తుకునేలా చేసే సినిమాలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈసారి కొందరు హీరోలకు, హీరోయిన్లకు బాగానే కలిసివచ్చింది. మరికొందరికి నిరాశే మిగిలింది. ప్రథమార్దానికి వీడ్కోలు చెబుతూ.. ద్వితీయార్దానికి స్వాగతం చెబుతాం. కాకపోతే... ఈ ద్వితీయార్దంలో ఎలాంటి ఆసక్తి ఉండకపోవచ్చు. పెద్ద హీరోలు సినిమాలేవీ రిలీజ్‌ కాకపోవచ్చు. దసరాకు కేవలం ఎన్టీఆర్‌ అరవిందసమేతగా రానున్నాడు. ఇది మినహా ఇంతవరకు ఏ పెద్ద సినిమా కూడా దసరాకు రాబోతున్నట్లు ప్రకటించలేదు. టాలీవుడ్‌కు సెకండాఫ్‌ కూడా కలిసిరావాలని ఆశిద్దాం.
- బండ కళ్యాణ్‌

టాలీవుడ్‌లో ఈ ఏడాది ప్రథమార్థం వచ్చిన సినిమాలపై మీ అభిప్రాయం ఏమిటి? మీకు బాగా నచ్చిన సినిమాలు ఏమిటి? మీ అభిప్రాయం పంచుకోండి

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top