Sakshi News home page

ముగ్గురు హీరోలు - నలుగురు హీరోయిన్స్

Published Thu, Jul 17 2014 3:42 PM

సిద్ధార్థ, శర్వానంద్, నాగచైతన్య, నాని, ఆర్య - Sakshi

మళయాలంలో పెద్ద హిట్గా నిలిచి, కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన 'బెంగళూరు డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయడానికి చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు ప్రధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అదేకోవలో హాస్యరసప్రధానంగా రూపొందే ఈ సినిమాలో నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.  తెలుగులో ప్రముఖ నిర్మాతలు  పొట్లూరి వరప్రసాద్, దిల్ రాజు కలసి దీనిని నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం.  

దీనిని ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నందున రెండు భాషల ప్రేక్షకులకు నచ్చిన హీరోహీరోయిన్లు కావాలి. ఒక సినిమాకు ఒక హీరో ఇద్దరు హీరోయిన్లను వెతకడమే నిర్మాతలకు కష్టం. కథ వారికి నచ్చాలి - కాల్షీట్లు ఖాళీ ఉండాలి - ఇవన్నీ కాక ఎవరికి ఏ పాత్ర అనే విషయం తేలాలి - వారి ఆమోదం కావాలి... ఇలా అనేకం కుదరాలి. ఇటువంటి పరిస్థితులలో రెండు భాషలు-ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్లు అంటే నిర్మాత దర్శకులు ఎన్ని తిప్పలు పడాలో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్మాతలు దిగ్గజాలు కాబట్టి కొంతవరకు పరవాలదనుకోండి.

బొమ్మరిల్లు సినిమాతో రాత్రికి రాత్రి అగ్రదర్శకుడైపోయిన భాస్కర్కు ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు దిల్ రాజు అప్పగించినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు తరువాత  ఆరెంజ్, ఒంగోలు గిత్తల పరాజయంతో భాస్కర్కు టాలీవుడ్కు మొఖం చూపించలేని పరిస్థితి ఎదురైంది. అయినా దైర్యం చేసి ఎంతో నమ్మకంతో దర్శకుడిగా భాస్కర్నే దిల్ రాజు ఎంపికచేశారని చెబుతున్నారు.  మలయాళంలో అంజలిమీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా సినిమాలో మెలోడ్రామాను శిఖర స్థాయికి తీసుకువెళ్లగలిగిన భాస్కర్ ఈ సినిమా కథ, కథనాలు తెలుగు సంస్కృతికి దగ్గరగా ఉండేవిధంగా  మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు సమాచారం.భాస్కర్కు ఇదో మంచి సదవకాశంగా భావించవచ్చు.

ఇక హీరోల విషయానికి వస్తే నాగచైతన్య - నాని - శర్వానంద్ - ఆర్య - సిద్ధార్ధ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారితో నిర్మాతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ముగ్గురులో ఓ హీరోగా చైతన్య  సరిపోతాడని భావిస్తున్నారు. అయితే ఈ కథ విన్న తరువాత చైతన్య పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. అందువల్ల చైతన్య  స్థానంలో తమిళ హీరోలు ఆర్య, సిద్దార్థ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఇద్దరూ హీరోల విషయానికి వస్తే నాని - శర్వానంద్లను ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. వీరు  ఇద్దరూ తెలుగులో పాటు తమిళంలో కూడా ఇమేజ్ ఉన్నవారే. హీరోయిన్ల విషయానికి వస్తే  సమంతను ఖరారు చేసినట్లు సమాచారం. ఇంకా ముగ్గురు కావాలి.  ఆ వేటలోనే నిర్మాత దర్శకులు ఉన్నారు. ఈ చిత్రం టైటిల్  తెలుగులో 'హైదరాబాద్ డేస్', తమిళంలో 'చెన్నై డేస్' అని పెట్టే అవకాశం ఉంది.

 - శిసూర్య

Advertisement
Advertisement