నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతీ హాసన్‌

Shruthi Hassan Comments on Kamal Hassan Properties - Sakshi

నాన్న ఆస్తిలో వాటా అడగలేదు అంటున్నారు సంచలన నటి శ్రుతీహాసన్‌. దక్షిణాది నటిగానే కాకుండా భారతీయ నటిగా పేరు తెచ్చుకున్న సంచలన నటి ఈ బ్యూటీ. కథానాయకిగా క్రేజ్‌ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ మధ్య లండన్‌కు చెందిన మైఖేల్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడి నటనను కాస్త అలక్ష్యం చేశారనే చెప్పాలి. అయితే అతనితో ప్రేమ బ్రేకప్‌ అవ్వడంతో తిరిగి నటనపై దృష్టి సారించారు. ప్రస్తుతం తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా లాభం అనే చిత్రంతో పాటు ఒక హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలు, అలవాట్ల గురించి వెల్లడించారు. గతంలో తనకు ఎక్కువ ఖర్చు చేసే అలవాటు తనకుండేదని చెప్పారు. దీంతో అవసరాల కోసం పని చేశాననీ,అందులో సంతృప్తి లభించలేదనీ చెప్పారు. సంతోషంగా జీవించడానికి డబ్బు ఉంటే చాలదన్నది అర్ధం అయ్యిందన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న హీరోయిన్ల కంటే తన సంపాదన తక్కువేనని అన్నారు. ఇంకా చెప్పాలంటే తాను పెద్ద స్టార్‌ను కానని అంది.

తన తండ్రి కమలహాసన్‌ సినిమాల్లో సంపాదించింది సినిమా రంగంలోనే పెట్టారని  చెప్పారు. సాధారణంగా సంసాదించిన దానితో ఆస్తులు కూడబెట్టకుంటారనీ, అలాంటిది తన తండ్రి రాజ్‌కమల్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి చిత్రాలను నిర్మిస్తున్నారని తెలిపారు. ఆయనకు సినిమానే శ్వాస అని పేర్కొన్నారు. మాకు ఏమైన మిగిల్చారా? ఆయన ఆస్తిలో మా వాటా ఎంత? అని తాను గానీ, తన చెల్లెలు గానీ అడిగిన సందర్భం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు.

నిజం చెప్పాలంటే తన బాల్య జీవితం చాలా సంతోషంగా సాగిందన్నారు. నాన్న మొదట చెన్నైలోని ఒక పాఠశాలలో చదివించారనీ, ఆ తరువాత అమెరికాలో మంచి కళాశాలలో చేర్పించారనీ చెప్పారు. మంచి ఆహారం, అంతకంటే మంచి దుస్తులు, ఖరీదైన కారు, అందమైన ఇల్లు అంటూ అన్నీ అందించారని చెప్పారు. తాను 21వ ఏట నుంచి కథానాయకిగా నటిస్తూ సంపాదించడం ప్రారంభించానన్నారు.

ఆ తరువాత నాన్న నుంచి డబ్బు తీసుకోవడం మానేశానని చెప్పారు. అంతే ఇప్పటి వరకూ నాన్న ఆస్తిలో తన వాటా ఎంత? అని అడిగింది లేదని చెప్పారు. తనకు అవసరమైన డబ్బును తానే సంపాదించుకుంటున్నానని తెలిపారు. రేపు తన పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తానని చెప్పారు. తల్లిదండ్రులు  ఇచ్చేది ఇస్తారనీ, అయితే మన సంపాదన గురించి మనం ప్రయత్నించాలనీ నటి శ్రుతీహాసన్‌ పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top