మార్చాలి.. మారకూడదు – జమున

Senior Actress Jamuna Exclusive Interview - Sakshi

వ్యవస్థ తప్పు చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా మనం మారుతూపోతే, చివరకు మనమే ఉండం. మన ఉనికే ఉండదు. మన వ్యక్తిత్వం ఉండదు. మనల్ని మనం గుర్తించలేనంతగా మారిపోతాం. మారడం కంటే వ్యవస్థనే మార్చాలి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే వ్యవస్థ నీ కాళ్ల దగ్గర మోకరిల్లుతుంది.

సినీ రంగంలోకి వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురు కావడం సహజం. ఏదోరకంగా ఆడవారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. నేను, భానుమతి లాంటి కొందరు మాత్రం అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం. షూటింగ్‌లో నా హద్దుల్లో నేను ఉండేదాన్ని. మేకప్‌ వేసుకోవడం, నటించడం...ప్యాకప్‌ చెప్పగానే ఇంటికి వెళ్లిపోవడం... అంతవరకే. అనవసరంగా ఎవరోఒకరితో మాటలు కలపడం నాకు ఇష్టం ఉండేది కాదు. ‘నా ఆత్మాభిమానం నేనే కాపాడుకోవాలి’ అని నాకు నేనుగా అనుకున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఏ పనీ చేయక్కర్లేదు అని ప్రతివారు అనుకుంటే ఏ రంగంలోనైనా వ్యక్తిత్వంతో నిలబడగలుగుతారని నా అభిప్రాయం. వ్యక్తిత్వానికి ఆటంకం కలిగేలా ఉంటే, కెరీర్‌ను వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉండేదాన్ని.

నేను సెట్‌లో ఉంటే అందరూ జాగ్రత్తగా ఉండేవారు...
నాకు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవాటు చేశారు నాన్నగారు. సెట్‌లో అనవసరంగా నవ్వితే ఆయన ఊరుకునేవారు కాదు. మర్యాదగా ప్రవర్తిస్తూ, షూటింగ్‌ పూర్తి చేసుకుని రావాలనే నేర్పారు. అది నా మంచికే అని తెలిసింది. ఇంట్లో మాత్రం అందరం సరదాగా నవ్వుతూ తుళ్లుతూ ఉండేవాళ్లం. నా వ్యక్తిత్వానికి భంగం కలిగేలా ఉంటే నేను సహించలేను. పెద్ద పెద్ద్ద హీరోలు కూడా నేను షూటింగ్‌లో ఉంటే చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. ఒక రోజు షూటింగ్‌లో నేను లేననుకుని, ఒక పెద్ద హీరో మద్యం సేవించి వచ్చారు.

సాధారణంగా సినిమాలో హీరో తప్పించి, మిగిలిన పాత్రలతో ఎలా నటించినా మద్యం వాసన మనకు తెలియదు, కాని హీరోలతో కొన్ని సీన్స్‌లో చాలా క్లోజ్‌గా నటించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వారి నోటి నుంచి వచ్చే మద్యం వాసన భరించడం ఎవరికైనా కష్టమే. అందుకే ఆ రోజు నేను షూటింగ్‌ చేయనని చెప్పేశాను. అప్పటికే ఒక అమ్మాయిని పట్టుకుని, కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నారుట ఆ హీరో. ఆ సందర్భంలో నేను ఉండి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేదని సెట్‌లో అందరూ నాతో అన్నారు. ఆ మాటలకు నాకు సంతోషంగా అనిపించింది. నేను ఉండటం వల్ల సెట్‌లో క్రమశిక్షణ ఉంటుంది అని అందరూ అనుకోవడం నాకు గర్వకారణమే కదా. వాస్తవానికి నేను – ఆ హీరో కాంబినేషన్‌ చాలా బావుంటుందని అందరూ అనుకునేవారు. మాది హిట్‌ పెయిర్‌ కూడా.

నాన్నగారికి కోపం వచ్చింది...
ఎన్‌టిఆర్, ఏయన్నార్‌...  మూడేళ్లు నాతో నటించకుండా నన్ను బాయ్‌కాట్‌ చేశారు. అందుకు వాళ్లు చెప్పిన కారణాలు విన్నాక నాకు నవ్వు వచ్చింది. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, టైమ్‌కి సెట్స్‌లోకి రానని ప్రచారం చేశారు. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంలో తప్పేమిటో అర్థం కాలేదు. అంటే ఒక హీరోయిన్‌ అలా కూర్చోకూడదనా వాళ్ల ఉద్దేశం. అంత పెద్ద హీరోలకి ఆడవాళ్ల మీద అలాంటి అభిప్రాయం ఉండటం సరికాదు. వాళ్లు అన్నమాటలే నిజం అయి ఉంటే, ప్రతి కంపెనీలోను ఆరు సినిమాలు ఎలా చేయగలుగుతాను. అంతేనా నేను నటించిన సినిమాలు ఏడాదికి ఆరు విడుదలయ్యేవి. నిజంగానే  నేను పొగరుగా ఉండి, టైమ్‌కి షూటింగ్‌కి రాకపోతే ఇన్ని సినిమాలు చేయగలిగేదానినా!

పరిశ్రమ ఎంతో మారిపోయింది...
అప్పట్లో నిర్మాతలు విలువలు పాటించేవారు. వ్యాపార దృక్పథంతో పాటు కంపెనీ నిలబడి బెస్ట్‌గా ఉండాలి అనుకునేవారు. అన్నపూర్ణ, జగపతి, సురేశ్‌... అందరూ ఉద్దండులే. ప్రస్తుతం సినీరంగంలో ‘నిర్మాతలు’ అని చెప్పుకునేవారికి, మా తరం నిర్మాతలకి పొంతన లేదు. ఈ తరం నిర్మాతలు ‘ఫలానా హీరోయిన్‌ అయితే బావుంటుంది’ అనుకుంటున్నారు. ఓపెనింగ్‌లకి హీరోయిన్లను పిలిచి మీద చేయి వేస్తున్నారు. అంత బలహీనంగా ఉంది వారి తత్త్వం. ఆ రోజులతో పోలిస్తే ఇప్పుడు లైంగిక వేధింపు ఎక్కువగా ఉందేమో అనిపిస్తోంది.

నేను శక్తిని...
నేను సినిమాలలో శక్తిస్వరూపిణిగా కత్తి దూసి యుద్ధం చేశాను కనుక ‘జమున శక్తి స్వరూపం’ అని నాకు పేరు. నేను శక్తిని అనుకోవడం ప్రతి స్త్రీకి చాలా అవసరం. ప్రస్తుతం అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. వారిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. జీవితం అంటే పెళ్లి కాదు, మొగుడి చేతిలో బానిసలా ఉండక్కర్లేదు. చక్కగా చదువుకున్నవారు తగిన ఉద్యోగం చేయొచ్చు, చదువురానివారు రెండు గేదెలను లేదా ఆవులను కొనుక్కుని పాల వ్యాపారం చేసుకుంటూ హుందాగా బతకొచ్చు. అంతేకాని ఆత్మాభిమానం చంపుకుని బతకవలసిన అవసరం లేదని నా అభిప్రాయం.

అమ్మ పెంపకంలో....
మా అమ్మ  చాలా ధైర్యవంతురాలు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, రెండు రోజులు జైలుకి కూడా వెళ్లింది.  ధైర్యంగా ఉండటం ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కాపాడుకోవడం కూడా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అందుకే అందరూ నాకు అన్నీ అమ్మ బుద్ధులే వచ్చాయి అనేవారు. మా అమ్మ∙సాక్షాత్తు దేవత. ఆవిడ పెంపకంలోనే ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, ఎటువంటి సమస్యలు ఎదురైనా తట్టుకోవడం వచ్చాయేమో అనిపిస్తుంది.

ఇంటర్వ్యూ: వైజయంతి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top