ఓ బేబీ ఎంత పనిచేశావ్‌ | Samantha Upcoming Movies Updates | Sakshi
Sakshi News home page

ఓ బేబీ ఎంత పనిచేశావ్‌

Jul 31 2019 7:09 AM | Updated on Jul 31 2019 7:09 AM

Samantha Upcoming Movies Updates - Sakshi

చెన్నై : ఏ నటీనటుడికైనా జీవితంలో గుర్తుండిపోయిన చిత్రాలంటూ కొన్ని ఉంటాయి. అలా నటి సమంత తన జీవితంలో మరచిపోలేని చిత్రం ఏం మాయచేసావే. ఈ చిత్రం తెలుగులో ఆమెను నటిగా సుస్థిరత స్థానాన్ని కల్పించడంతో పాటు, తనకు జీవిత భాగస్వామినే అందించింది. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో పలు కమర్షియల్‌ చిత్రాలు చేసి స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. అలాంటిది తను తాజాగా  నటించిన ఓబేబీ చిత్రం సమంతను మరో స్థాయికి తీసుకెళ్లింది. అదే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాల నాయకి స్థాయి. అనుష్కకు ఓ అరుంధతి, నయనతారకు ఓ మాయ, అరమ్‌ చిత్రాల లాగా సమంతకు ఓ బేబీ మైలురాయిగా నిలిచి పోతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ చిత్రం తన జీవితానికి సంబంధించిన నిర్ణయాన్నే మార్చుకునేలా చేసింది. ఈ విషయాన్ని సమంతనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఈ బ్యూటీ తెలుగు నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా కథానాయకిగా తన క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గకుండా కాపాడుకుంటూ వస్తోంది. తరుచూ గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉంటోంది. కాగా ఓ బేబీ చిత్రం తరువాత ఈ భామ తమిళ చిత్రం 96 రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత సమంత వచ్చే ఏడాది తల్లి కావాలని నిర్ణయించుకుందనే ప్రచారం జరిగుతోంది. కాగా ఆ ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేలా సమంత తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. 96 చిత్రం తరువాత తాను నటించనున్న కొత్త చిత్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపింది.  నటి అనుష్క నటించిన భాగమతి చిత్రం తరువాత అమెరికాలో ఒక మిలియన్‌ డాలర్లు వసూళ్లు సాధించిన చిత్రం ఓ బేబీనేనని పేర్కొంది. అందుకే తాను బిడ్డకు తల్లి కావాలన్న తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఇకపై  ఈ బ్యూటీ కథానాయకికి ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఓ బేబీ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందన్న మాట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement