భవిష్యత్తులో పెదరాయుడు సీక్వెల్‌

Sakshi Interview with Mohan Babu About Pedarayudu Completing 25 Years

– మోహన్‌బాబు

‘‘ఓసారి ర జనీకాంత్‌ ఫోన్‌ చేస్తే ఇంటికెళ్లాను. ‘తమిళంలో ‘నాట్టామై’ సినిమా హిట్‌ అయింది. రీమేక్‌ హక్కులు మాకు కావాలని చెబుతాను.. నువ్వు సినిమా చూసి నిర్ణయం చెప్పు’ అన్నాడు. సినిమా చూశా.. చాలా బాగుంది, హక్కులు కావాలని రజనీకి చెప్పాను. ‘నిర్మాత ఆర్‌బీ చౌదరిగారితో మాట్లాడాను నువ్వు వెళ్లి మాట్లాడు’ అన్నాడు. నేను కలవగానే, ‘రజనీగారు చెప్పాక కాదనేది ఏముంది.. ఇస్తాను’ అన్నారు ఆర్‌బీ చౌదరిగారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్లు(1995 జూన్‌ 15) అవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు సాక్షితో పంచుకున్న విశేషాలు...

► ‘నాట్టామై’ రీమేక్‌ హక్కులు తీసుకున్నాక రజనీతో ‘రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు.. అన్ని పాత్రలు కుదిరాయి. పాపారాయుడు పాత్ర కుదరలేదురా’ అన్నాను. ‘నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఆ పాత్ర నేను చేస్తున్నాను’ అన్నాడు. ‘నువ్వేంట్రా! అది అతిథి పాత్ర.. పైగా నువ్వు నాకు తండ్రి వేషం వేయడమేంటి?’ అనగానే.. ‘అవును రా.. ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది, నేను చేయాలనుకునే నీకు చెప్పాను.. చేస్తాను’ అన్నాడు. ఈ విషయం రవిరాజాకి చెప్పగానే ఆశ్చర్యపోయాడు.

► ‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్‌గారు క్లాప్‌ ఇచ్చారు. తొలి షాట్‌లో రజనీకాంత్‌కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది’ అన్నాడు రజనీ.

► ‘పెదరాయుడు’కి ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్‌ ఎలా తెలుసుకున్నాడో. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్లాను.. ఇద్దరం కలిసి కారులో హోటల్‌కి వెళ్లాం.. ‘ఇది తీసుకోరా’ అన్నాడు.. చూస్తే 45లక్షలు ఉంది. ‘ఎందుకురా?’ అని అడిగా. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, ‘పెదరాయుడు’ మంచి విజయం సాధిస్తుంది.. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు.. నిజంగా వాడు గొప్ప మనిషి.

► ‘పెదరాయుడు’ సినిమాలో మంచి విషయం ఉంది. నటీనటులందరూ బాగా సహకరించారు. సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్‌ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్‌) లేరు. సౌందర్య, కెమెరామేన్‌ కేఎస్‌ ప్రకాశ్‌రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్‌ టు గెదర్‌ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు.. లేకుంటే చేసేవాణ్ణి.

► కొన్నేళ్ల తర్వాత ఏముందిలే.. ఇంకా ఏం చూస్తాం అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. నేను ఇంకా ఏదైనా మంచి పాత్ర చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుకీ కొన్ని పాత్రలకు అడుగుతుంటే నేనే వద్దనుకుంటున్నాను.. కొన్ని పాత్రలు నచ్చడం లేదు. నేను కానీ చేస్తే ఏడాదిలో 365 రోజులూ బిజీగానే ఉంటాను. నా జీవితంలో జరిగిందంతా భగవంతుని ఆశీస్సులు, ప్రకృతి వల్లే. ‘మనం విర్రవీగకూడదు.. అహంకారం తలకెక్కకూడదు.. మనిషి మనిషిగా బతకాలి’అనేవి మరచిపోకూడదు.

► ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా.  సినిమాల్లో అయినా, రాజకీయమైనా భగవంతుని ఆశీస్సుల వల్లే రాణించగలం. రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మాండంగా పనిచేయాలి. సినిమాల్లో నటించాలంటే బ్రహ్మాండంగా నటన తెలిసి ఉండాలి. అక్కడా ఇక్కడా విజయం అన్నది ఒక్కటే అయినా.. సినిమాలు మాత్రం కొంచెం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఒక భాషలో హిట్‌ అయిన సినిమా మరో భాషలోనూ హిట్‌ కావాలనే రూల్‌ లేదు.. ఇదంతా కాకతాళీయమే.. భగవంతుని ఆశీస్సులే.

► ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనాని ఎవరు పంపించారు? ఇదేమైనా ప్రపంచయుద్ధమా? 82లక్షల జీవరాసుల తర్వాత మనుషులం పుట్టామని అంటారు. మనిషి జన్మ అనేది గొప్పది. ఈ జన్మని మనం మరచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నాం. అందుకే కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారురా మనుషుల్లారా అని దేవుడు కరోనా రూపంలో ఓ దెబ్బ కొట్టాడు.  ఇది ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. తలనొప్పి, కలరా, మలేరియా, టైఫాయిడ్‌.. వీటికి మందులు వచ్చాయి. కానీ, కరోనాకి ఇప్పటికి విరుగుడు మందు అయితే లేదు.

‘పెదరాయుడు’ని రీమేక్‌ చేయాలనుకుంటే మీరు, విష్ణు, మనోజ్‌.. చేసే అవకాశం ఉంటుందా?
ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్‌ చేసే అవకాశం ఉండొచ్చేమో. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ ‘పెదరాయుడు’ అనేది చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top