సల్మాన్‌ను కొట్టిన వారికి నగదు బహుమతి! | Pravin Togadia Associate Announces Reward to Thrash Salman Khan | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ను కొట్టిన వారికి 2 లక్షలిస్తాం!

Jun 1 2018 9:44 AM | Updated on Jun 1 2018 1:24 PM

Pravin Togadia Associate Announces Reward to Thrash Salman Khan - Sakshi

సాక్షి, ముంబై: సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ సంస్థలో నవరాత్రి ఉత్సవ నేపథ్యంలో రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ‘లవరాత్రి’ సినిమా హిందువుల మనోభావాలను కించపరుస్తున్నట్లుగా ఉందని, టైటిల్‌ కూడా హిందువులు పవిత్రంగా భావించే ‘నవరాత్రి’ని హేళన చేస్తున్నట్లుగా ఉందని హిందూ హై ఆజ్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం విశ్వహిందూ పరిషత్ మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా ఏర్పాటు చేసిన ‘హిందూ హై ఆజ్’  సంస్థ ఆగ్రా నగర విభాగం అధ్యక్షుడు గోవింద్ పరాషర్ ఓ సంచలన ప్రకటన చేశారు. బహిరంగంగా సల్మాన్ ఖాన్ను కొట్టిన వారికి రూ. 2లక్షల బహుమతి ఇస్తానని ప్రకటించారు. 

గురువారం ఆగ్రాలోని భగవాన్ థియేటర్‌లో లవరాత్రి సినిమాకు చెందిన సల్మాన్ ఖాన్ పోస్టర్లను హిందూ హై ఆజ్ కార్యకర్తలు దహనం చేశారు. హిందువుల పర్వదినం నవరాత్రి నేపథ్యంలో మూవీ తీయడంతో పాటు ఆ పేరు అర్థాన్ని కూడా నాశనం చేసేలా ఉందని, కాబట్టి ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకుంటామని తెలిపారు. ఈ సినిమా అక్టోబరులో విడుదల కానున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పండుగ తొమ్మిది రోజుల్లో ఓ యువ జంట మధ్య చిగురించే ప్రేమను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా సల్మాన్‌ ఖాన్‌ బావ ఆయుష్‌ శర్మ హీరోగా పరిచయం కాబోతున్నారు.  

గతంలో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో, దీపికా పదుకొనే నటించిన ‘పద్మావత్‌’ సినిమా విడుదలకు ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా ఉం‍దనే ఆరోపణలతో కొన్ని వారాల పాటు వాయిదాపడ్డా.. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించి, విడుదలైంది. 

Advertisement
 
Advertisement
Advertisement