సంక్రాంతి బరి నుంచి నాగ్ తప్పుకున్నట్టేనా..? | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బరి నుంచి నాగ్ తప్పుకున్నట్టేనా..?

Published Tue, Nov 1 2016 12:11 PM

సంక్రాంతి బరి నుంచి నాగ్ తప్పుకున్నట్టేనా..? - Sakshi

యంగ్ హీరోల హవా పెరిగిన దగ్గర నుంచి సీనియర్ హీరోలు స్పీడు తగ్గించారు. దీంతో ఒకేసారి ఇద్దరు ముగ్గురు సీనియర్ హీరోల సినిమాలు థియేటర్లలో కనిపించటం లేదు. యంగ్ హీరోస్ కూడా సినిమాల మధ్య గ్యాప్ మెయిన్టైన్ చేస్తుండటంతో ఒకేసారి రెండు మూడు భారీ సినిమాల రిలీజ్లు అరుదుగా కనిపిస్తున్నాయి. అయితే రాబోయే సంక్రాంతికి మాత్రం భారీ పోటికి రంగం సిద్ధమవుతోంది. సీనియర్ హీరోలందరూ ఒకేసారి బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు.

చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. తాజాగా మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా పోటికీ సై అన్నాడు. సుధా కొంగర దర్శకత్వంలో హిందీ సినిమా సాలాఖద్దూస్ రీమేక్గా తెరకెక్కుతున్న గురు సినిమాను అదే సమయంలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.

కానీ కింగ్ నాగార్జున మాత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమోవేంకటేశాయ సినిమాలో నటిస్తున్న నాగ్, ముందుగా ఈ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని భావించాడు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాదేమో అన్న అనుమానంతో సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. నాగ్ కూడా బరిలో నిలిస్తే చాలా ఏళ్ల తరువాత నలుగురు సీనియర్ హీరోలు ఒకే సారి థియేటర్లలో సందడి చేసేవారు.

 
Advertisement
 
Advertisement