జంతుర్‌ మంతర్‌ సైలెన్స్‌... యాక్షన్‌! | Mute organisms are Silence Action films | Sakshi
Sakshi News home page

జంతుర్‌ మంతర్‌ సైలెన్స్‌... యాక్షన్‌!

Published Sun, Oct 14 2018 12:41 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

Mute organisms are Silence Action films - Sakshi

మాట్లాడటానికి భాష కావాలి కానీ భావాలను చెప్పడానికి అక్కర్లేదు. ఆలకిస్తే మౌనం కూడా మాట్లాడుతుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే కళ్లు కూడా కథలు చెబుతాయి. ఇలాంటప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌పై ప్రతిభ ఉన్న యాక్టర్స్‌తో పాటు మూగజీవాలు నటిస్తే తప్పేముంది! ప్రేక్షకులకు మంచి వినోదం దొరుకుతుంది. ప్రస్తుతం మూగజీవాలు కీలకపాత్రలుగా రూపొందుతున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

తోడుగా... విశ్వాసంగా...!
వెండితెర దేవదాస్‌కు మందు బాటిల్‌తో తోడుగా ఉంది కుక్కే. అందుకనే కదా మూగజీవాల్లో విశ్వాసానికి పర్యాయపదంగా కుక్కను చెబుతారు. కానీ తప్పుడు శిక్షణ ఇచ్చామో.... ‘ఒక్కడు’ సినిమాలో తెలంగాణ శకుంతల ఉన్న క్లైమాక్స్‌ సన్నివేశాన్ని ఓసారి గుర్తు చేసుకోవడమే. మరీ.. ఇప్పుడు కుక్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న సౌత్‌ సినిమాల గురించి తెలుసుకుందాం. రాత్రివేళలో గుర్కా చేతిలో టార్చిలైట్‌తో పాటు ఓ కుక్క ఉంటే దొంగల పని అరికట్టడం మరింత సులువు అవుతుంది.

అలా ఓ సెక్యూరిటీ గార్డ్‌ తనకు ఎదురైన ఓ సమస్యను ఓ కుక్క సాయంతో ఎలా పరిష్కరించాడనే నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘గుర్కా’. ఈ సినిమాలో సెక్యూరిటీ గార్డుగా హాస్యనటుడు యోగిబాబు లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. సామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. అలాగే కన్నడ ‘కిర్రిక్‌పార్టీ’ సినిమాతో  ఫేమ్‌ సంపాదించిన రక్షిత్‌ శెట్టి ప్రస్తుతం ‘777 చార్లీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఓ రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ డాగ్‌ రక్షిత్‌కు ఎప్పుడూ తోడుగా ఉంటుందట. ఉండి? ఏం చేస్తుంది? అంటే వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు ఈ సినిమా దర్శకుడు కిరణ్‌రాజ్‌.

గొరిల్లా ప్లాన్‌!
తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లోకి ‘గోరిల్లా’ను చేర్చుకుని ఓ ప్లాన్‌ వేశారు యాక్టర్‌ జీవా. ఆ ప్లాన్‌ తాలూకు డీటైల్స్‌ షాలినీ పాండేకి తెలుసు. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. అలాగే జీవా ప్లాన్‌ సక్సెస్‌ కావడం కోసం గొరిల్లా చేత గన్‌పట్టించారు జీవా. మరి.. గొరిల్లా ఎవర్ని షూట్‌ చేసిందనే విషయం సిల్వర్‌స్క్రీన్‌పై చూసి తెలుసుకోవాల్సిందే.

పగ పట్టిందెవరు?
అసలు పాములు పగపడతాయా? వాటికి శక్తులు ఉన్నాయా? అమావాస్య, పౌర్ణమి వంటి సందర్భాలతో పాములకు ఏవైనా లింక్‌ ఉందా? ఇటువంటి విషయాలపై ఎప్పటినుంచో పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్స్‌ సంబం«ధీకులు ‘నో’ అంటే దైవాన్ని నమ్మేవారు ‘ఎస్‌’ అంటున్నారు. ఇవన్నీ ఏమో కానీ ఈ కథనాలపై చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా తమిళంలో ‘నీయా 2’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో జై, వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరిన్, రాయ్‌ లక్ష్మీ నటిస్తున్నారు. ఇందులో హీరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా నటిస్తున్నారు.

కొన్ని పరిస్థితుల వల్ల కీబోర్డ్‌ పట్టుకోవాల్సిన జై.. నాగస్వరం ఊదుతారట. ఎందుకంటే వెండితెరపై చూడండి అంటున్నారు ‘నీయా 2’ దర్శకుడు ఎల్‌. సురేశ్‌. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ పూర్తయిందని టాక్‌. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘పున్నమినాగు’, సాయికుమార్‌ నటించిన ‘నాగదేవత’ సినిమాల్లో పాము లక్షణాలు హీరో పాత్రల్లో కనిపిస్తాయి. కానీ ‘పాంబన్‌’ సినిమా కోసం సగం పాముగా మారారు తమిళ నటుడు శరత్‌ కుమార్‌. ఈ సినిమాకు ఎ. వెంకటేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి శరత్‌ కుమార్‌తో కలిసి నటిస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్‌.

మూగజీవాలతో షూటింగ్‌ అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కష్టపడాలి. ముఖ్యంగా లొకేషన్‌లో టీమ్‌ అందరూ చాలా ఓర్పుగా ఉండాలి. ఒక్కోసారి చిన్న షాట్‌ కోసం కూడా చాలా టైమ్‌ వెచ్చించాల్సి రావచ్చు. అలాగే సినిమా విడుదల సమయంలో సంబంధిత అధికారుల నుంచి టీమ్‌ అనుమతి పొందాల్సిందే. ఎలాగూ  గ్రాఫిక్స్‌ వర్క్స్‌ ఉండనే ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నా.. పర్లేదు. సినిమా చూసి ఆడియన్స్‌ ఆనందపడాలి. కాసుల రూపంలో ఆ సంతోషం మాకు షేర్‌ కావాలి అని ఆయా సినిమా నిర్మాతలు అనుకుంటున్నారు. ఇలాంటి సినిమాలను ముఖ్యంగా పిల్లలు  బాగా ఇష్టపడతారని అనుకోవచ్చు.

అదుగోనండీ బంటీ
సాధారణంగా పందిపిల్ల అంటే అందరూ అదోరకంగా చూస్తారు. అదే వెండితెరపై విన్యాసాలు చేస్తే ఎంజాయ్‌ చేయకుండా ఉండరు. ఈ థ్రిల్‌ కోసమే దాదాపు రెండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు దర్శక–నటుడు రవిబాబు. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అదుగో’. ఈ సినిమాలో బంటీ అనే కీలకపాత్రలో పందిపిల్లను నటింపజేశారు టీమ్‌. అంతేకాదు.. ఈ సినిమాకు లైవ్‌ యాక్షన్‌ 3డీ యానిమేషన్‌ టెక్నాలజీని కూడా యాడ్‌ చేశారు చిత్రబృందం.

ఈ సినిమాను భారతీయ అన్ని భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ‘అదుగో’ పేరుతో విడుదల చేస్తారు. మిగిలిన భాషల్లో ‘బంటీ’ అనే టైటిల్‌ పెట్టారు. అన్నట్లు ఈ సినిమాలో బంటీపై పాటలు కూడా ఉన్నాయటండోయ్‌. ఈ సినిమాలో నటి పూర్ణ ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా చేశారు. వర్మ, రవిబాబు, ఉదయ్‌ భాస్కర్, ఆర్కే, వీరేందర్‌ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ విహారి స్వరకర్త. త్వరలో విడుదల కానుంది.


‘అదుగో’ లో బంటి

 గజ రాజసం
అడవి నేపథ్యంలో సినిమా వెండితెరపైకి వస్తుందంటే అందులో కచ్చితంగా ఒక్కసీన్‌లో అయినా గజరాజు కనిపిస్తాడు. ఆ మాటకొస్తే... ఎన్టీఆర్‌ ‘అడవిరాముడు’, చిరంజీవి ‘అడవిదొంగ’, రాజేంద్రప్రసాద్‌ ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాల్లో గజరాజు పాత్ర ఎంత పవర్‌ఫుల్లో ప్రేక్షకులకు తెలియనిది కాదంటారా. ఏనుగుతో ఈ వెండితెర మ్యాజిక్‌ను రిపీట్‌ చేయడానికే టాలీవుడ్‌ టార్జాన్‌ రానా, బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో విద్యుత్‌ జమాల్, ‘తమిళ బిగ్‌బాస్‌ 2’ ఫేమ్‌ అరవ్‌ ప్రయత్నిస్తున్నారు.

అడవి జీవితం ఎలా ఉందో బందేవ్‌ని అదేనండీ... రానాని పలకరిస్తే... థాయ్‌లాండ్, కేరళ అడవుల్లో తాను తిరిగిన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్‌ చేస్తున్నారట. ముఖ్యంగా ఏనుగులతో గడిపిన సీన్స్‌ను గుర్తుచేస్తున్నారట. ఇదంతా ఆయన తాజాగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమా ప్రభావమని ఊహించవచ్చు. రానా హీరోగా నటిస్తున్న ‘అరణ్య’ సినిమాకు ప్రభు సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు ‘కాదన్‌’ అని, హిందీ వెర్షన్‌కు ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

రానా ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్‌లో ఏనుగుల భాషను బాగా అర్థం చేసుకుని వాటితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నారు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో విద్యుత్‌ జమాల్‌. జమాల్‌కు ఈ అవసరం ఎందుకొచ్చిందంటే ‘జంగ్లీ’ సినిమా కోసం. మనుషులకు–ఏనుగులకు మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఆధారంగానే ఈ సినిమా రూపొందుతోంది. థాయ్‌లాండ్‌లో ఎక్కువగా షూట్‌ చేశారు. ఈ సినిమాకు అమెరికన్‌ డైరెక్టర్‌ చెక్‌ రసెల్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరవ్‌  హీరోగా నటిస్తున్న సినిమాకు ‘రాజ్‌ భీమా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు నరేశ్‌ సంపత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కేవలం గజరాజు మాత్రమే కాదు. మిగతా జంతువులకూ ప్రాధాన్యం ఉంటుందట. ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలు విడుదలైతే చిన్నపిల్లలు ఏనుగమ్మా.. ఏనుగు.. మా ఊరి థియేటర్స్‌లోకొచ్చిందేనుగు అని పాడుకుంటారేమో.


రానా


అరవ్‌


జీవా, షాలినీపాండే
 


విద్యుత్‌ జమాల్‌


యోగిబాబు
 


రక్షిత్‌శెట్టి


వరలక్ష్మి
జై

శరత్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement