నాగ్-కార్తీ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ | Movie Start in Nag-Karthi combination | Sakshi
Sakshi News home page

నాగ్-కార్తీ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్

Feb 11 2015 10:47 PM | Updated on Jul 15 2019 9:21 PM

నాగ్-కార్తీ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ - Sakshi

నాగ్-కార్తీ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్

నాగార్జునకు తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గీతాంజలి, శివ, రక్షకుడు తదితర చిత్రాలు తమిళంలోనూ విడుదలై, విజయం సాధించాయి.

నాగార్జునకు తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గీతాంజలి, శివ, రక్షకుడు తదితర చిత్రాలు తమిళంలోనూ విడుదలై, విజయం సాధించాయి. అలాగే తమిళ హీరో కార్తీ నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో విడుదలవుతుంటాయి. ఆ విధంగా కార్తీకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలా రెండు భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి చిత్రనిర్మాత సతీమణి ఝాన్సీ సురెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నాగ్ సతీమణి అక్కినేని అమల క్లాప్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి సతీమణి మాలిని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఇది చాలా మంచి కథ. కచ్చితంగా విభిన్న తరహా మల్టీస్టారర్ అవుతుంది’’ అని తెలిపారు. తెలుగులో తన తొలి స్ట్రయిట్ చిత్రం నాగార్జునతో కలిసి చేయడం ఆనందంగా ఉందని కార్తీ చెప్పారు.

ఈ చిత్రంలో నటించడానికి నాగార్జున, కార్తీ అంగీకరించడం సగం విజయం సాధించినట్లుగా ఉందనీ, ఈ చిత్రం ద్వారా దర్శకునిగా తనను తమిళంలో పరిచయం చేస్తున్న పీవీపీకి ధన్యవాదాలని దర్శకుడు అన్నారు. వచ్చే నెల 16న రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడి పల్లి-హరి-సాల్మన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: గోపీసుందర్, కెమెరా: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్‌బాబు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement