breaking news
Directed by Vamsi Paidipally
-
నాగ్-కార్తీ కాంబినేషన్లో సినిమా స్టార్ట్
నాగార్జునకు తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గీతాంజలి, శివ, రక్షకుడు తదితర చిత్రాలు తమిళంలోనూ విడుదలై, విజయం సాధించాయి. అలాగే తమిళ హీరో కార్తీ నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో విడుదలవుతుంటాయి. ఆ విధంగా కార్తీకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలా రెండు భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి చిత్రనిర్మాత సతీమణి ఝాన్సీ సురెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నాగ్ సతీమణి అక్కినేని అమల క్లాప్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి సతీమణి మాలిని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఇది చాలా మంచి కథ. కచ్చితంగా విభిన్న తరహా మల్టీస్టారర్ అవుతుంది’’ అని తెలిపారు. తెలుగులో తన తొలి స్ట్రయిట్ చిత్రం నాగార్జునతో కలిసి చేయడం ఆనందంగా ఉందని కార్తీ చెప్పారు. ఈ చిత్రంలో నటించడానికి నాగార్జున, కార్తీ అంగీకరించడం సగం విజయం సాధించినట్లుగా ఉందనీ, ఈ చిత్రం ద్వారా దర్శకునిగా తనను తమిళంలో పరిచయం చేస్తున్న పీవీపీకి ధన్యవాదాలని దర్శకుడు అన్నారు. వచ్చే నెల 16న రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడి పల్లి-హరి-సాల్మన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: గోపీసుందర్, కెమెరా: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్‌బాబు. -
ఓ శుభవార్త!
‘‘మీతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా. కాకపోతే 24 గంటల తర్వాతే’’ అంటూ శ్రుతీహాసన్ ట్విట్టర్లో ఊరించారు. ఇది చదివినవాళ్లల్లో కొంతమంది శ్రుతి చెప్పనున్న ఆ శుభవార్త తన పెళ్లికి సంబంధించినది కావచ్చని కొందరు ఊహించేసుకున్నారు. కానీ, ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను’ అన్నారు కాబట్టి, పెళ్లికి సంబంధించిన వార్త అయ్యుండక పోవచ్చని కూడా భావించారు. వాస్తవానికి శ్రుతి చెప్పాలనుకున్న వార్త ఓ చిత్రానికి సంబంధించింది. నాగార్జున, కార్తీ కాంబినేషన్లో పీవీపీ సంస్థ ఓ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందని తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ను కథానాయికగా తీసుకున్నారు. దీని గురించే శ్రుతి ప్రత్యేకంగా ప్రకటించాలనుకున్నారు. ఈ కథ విన్నాననీ, కొత్తగా ఉండటంతోపాటు హృదయానికి హత్తుకునే విధంగా ఉందని ఆమె తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళాల్లో పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించనున్నారు.