ఫ్యాన్సే కాదు.. నేనూ కాలర్‌ ఎగరేస్తున్నా

Mahesh Babu raises his collar in pride - Sakshi

– మహేశ్‌బాబు

‘‘నా కెరీర్‌లో ‘మహర్షి’ స్పెషల్‌ ఫిల్మ్‌. నా బిగ్గెస్ట్‌ హిట్స్‌ని వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. సినిమాను సక్సెస్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు, మా నాన్నగారి(కృష్ణ) అభిమానులకు, నా అభిమానులకు హ్యాట్సాఫ్‌’’ అని హీరో మహేశ్‌బాబు అన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. సి. అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడులైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఈ రోజు మదర్స్‌ డే (ఆదివారం). నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ సినిమా రిలీజ్‌కు ముందు అమ్మ ఇంటికి వెళ్లి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. అమ్మ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. అందువల్లే ‘మహర్షి’ సినిమా ఇంత సక్సెస్‌ అయ్యింది. అందుకే అమ్మలకు ఈ సినిమా సక్సెస్‌ను అంకితం ఇస్తున్నాం.

‘మహర్షి’ సినిమా ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో వంశీ మాట్లాడుతూ నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాలర్‌ ఎత్తుకుని తిరుగుతారని అన్నాడు. వాళ్లు (అభిమానులు) కాలర్‌ ఎత్తారు వంశీ... ఇవాళ నేను కూడా కాలర్‌ ఎత్తాను. దత్‌గారు నన్ను ఎప్పుడూ ప్రిన్స్‌ బాబు అని పిలుస్తుంటారు. విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేశ్‌ అని పిలుస్తారు. ఆ పేరు కోసం ఎప్పుడూ వేచి చూస్తుంటాను. ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌ మహేశ్‌ అని దత్‌గారు అనడంతో చాలా సంతోషంగా అనిపించింది’’ అన్నారు.

అశ్వనీదత్‌ మాట్లాడుతూ– ‘‘కృష్ణగారు హిట్‌సాధించిన ఎక్కువ సినిమాలు రైతు నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మహేశ్‌ 25వ సినిమా రైతుల నేపథ్యంలో తెరకెక్కడం సంతోషంగా ఉంది. ఈ సినిమా సంచలన విజయానికి కారణం మహేశ్‌బాబు, వంశీలే.  మే 9న వైజయంతీ బ్యానర్లో విడుదలైన మూడు సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి గౌరవం తీసుకువచ్చినందుకు గర్వంగా ఉంది. ‘దిల్‌’ రాజును చూస్తే డి.రామానాయుడుగారు గుర్తుకువస్తారు’’ అన్నారు.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నానంటే సీనియర్‌ ప్రొడ్యూర్స్‌ నుంచి నేను పొందిన ప్రేరణే కారణం. ఈ సినిమా ప్రీ–రిలీజ్‌ వేడుకలో నేను మాట్లాడిన మాటలు నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఫస్ట్‌ వీక్‌లోనే మహేశ్‌గారి కెరీర్‌లోని రికార్డులను క్రాస్‌ చేయబోతున్నాం. ఈ సినిమా విజయం ఎంత పెద్దదో ఇప్పుడే చెప్పలేం’’ అన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మగారే. ‘మహర్షి’ సక్సెస్‌ క్రెడిట్‌లో 80శాతానికిపైగా మహేశ్‌గారికే చెందుతుంది. అశ్వనీదత్‌గారు, పీవీపీగారు బాగా సపోర్ట్‌ చేశారు. డైరెక్టర్‌గా నాకు జన్మనిచ్చిన ‘దిల్‌’ రాజుగారికి థ్యాంక్స్‌. ఇది మైండ్‌లకు చెప్పే సినిమా కాదు. మనసులకు చెప్పే సినిమా అని చెప్పాను. మనసుతో సినిమా చూసి ఇంత ఆనందాన్ని మాకు ఇస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు.

‘‘అల్లరి’ నరేశ్‌ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారు పర్‌ఫెక్షన్‌కి నిదర్శనం. నేను సీరియస్‌ క్యారెక్టర్స్‌ను చేయగలనని నమ్మిన వంశీ, మహేశ్‌లకు థ్యాంక్స్‌. ఇవాళ మా నాన్న(దర్శక–నిర్మాత ఈవీవీ సత్యనారాయణ) ఉండి ఉంటే చాలా సంతోషంగా ఫీలయ్యేవారు. ఒక డైరెక్టర్‌గా ఆయన గర్వపడేవారు. ఎందుకంటే ఆయన డైరెక్టర్‌ కంటే ముందు రైతు. ఆ రైతుగా ఇంకా గర్వపడేవారు. హిట్‌ అన్న పదం విని నాలుగేళ్లు అయ్యింది. ‘మహర్షి’ సక్సెస్‌తో  నాకు అనిపించింది... సక్సెస్‌కు కామాలే ఉంటాయి... ఫుల్‌స్టాప్‌లు ఉండవు’’ అన్నారు.

‘‘మహేశ్‌ కెరీర్‌లో హయ్యెస్ట్‌ కలెక్షన్స్‌ రాబడుతోంది ఈ చిత్రం. కథకు తగ్గట్టు సినిమాను తీస్తాడు వంశీ. పెద్ద సినిమాను ఎంత ప్రేమించి తీస్తారో, చిన్న సినిమానూ అంతే ప్రేమించి తీస్తారు ‘దిల్‌’ రాజు. అశ్వనీదత్‌ వంటి సీనియర్‌ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరం’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ‘‘రైతుల గురించి చర్చించిన ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉండటం హ్యాపీ’’ అన్నారు పృధ్వీ. ‘‘నేను కర్నూలులో స్టేజ్‌ ఆర్టిస్టుని. షార్ట్స్‌ఫిల్మ్స్‌లో నటిస్తున్న నన్ను చూసి దర్శకుడు వంశీ నాకు మహేశ్‌బాబుతో కలిసి నటించే అవకాశం ఇచ్చారు’’ అని రైతు పాత్ర చేసిన గురుస్వామి అన్నారు. నటులు శ్రీనివాసరెడ్డి, కమల్‌ కామరాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత శ్రీ మణి, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు యుగంధర్‌ మాట్లాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top