‘లక్ష్మీ’ మూవీ రివ్యూ

Lakshmi Telugu Movie Review - Sakshi

టైటిల్ : లక్ష్మీ
జానర్ : డాన్స్‌ బేస్డ్‌ మూవీ
తారాగణం : ప్రభుదేవా, దిత్య, ఐశ‍్వర్య రాజేష్‌
సంగీతం : సామ్‌ సీఎస్‌
దర్శకత్వం : ఏఎల్‌ విజయ్‌
నిర్మాత : ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్‌.రవీంద్రన్‌

తెలుగు తెర మీద డ్యాన్స్ బేస్డ్‌ సినిమాలు చాలానే వచ్చాయి. అదే జానర్‌లో తెరకెక్కిన మరో మూవీ లక్ష్మీ. ఇండియన్‌ డాన్సింగ్‌ లెజెండ్‌ ప్రభుదేవా ప్రధాన పాత్రలో దిత్యను పరిచయం చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన సినిమా లక్ష్మీ. అభినేత్రి, అన్న, నాన్న లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఏఎల్‌ విజయ్‌ మరోసారి తనదైన స్టైల్‌లో లక్ష్మీ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి ఈ ప్రయత్నం ఎవరకు విజయవంతమైంది..? 

కథ ;
లక్ష్మీ (దిత్య)కి చిన్నప్పటి నుంచి డాన్స్‌  అంటే పిచ్చి. కానీ తల్లి నందిని (ఐశ్వర్య రాజేష్‌)కి మాత్రం డాన్స్ అంటే గిట్టదు. అందుకే కూతుర్ని డాన్స్‌కు దూరంగా పెంచాలనుకుంటుంది. ఎలాగైనా డాన్సర్‌ కావాలని కలలు కంటున్న లక్ష్మీ టీవీలో ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ యాడ్‌ చూసి ఆ కాంపిటీషన్‌లో పాల్గొనాలని నిర్ణయించుకుంటుంది. అందుకే తల్లికి తెలియకుండా కాంపిటీషన్‌లో పాల్గొనటం కోసం ఓ రెస్టారెంట్‌ ఓనర్‌ కృష్ణ(ప్రభుదేవా) సాయం తీసుకుంటుంది.

కృష్ణను తన నాన్నగా పరిచయం చేసి హైదరాబాద్‌ డాన్స్‌ అకాడమీ లో జాయినవుతుంది. అదే సమయంలో కృష్ణకు లక్ష్మీ తను ప్రేమించిన నందిని కూతురు అని తెలుస్తుంది. లక్ష్మీ స్టేజ్‌ ఫియర్ కారణంగా టీం క్వాలిఫయింగ్‌ రౌండ్‌ నుంచి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ లక్ష్మీ, కృష్ణ కూతురని తెలుసుకున్న సెలక్టర్‌ యూసుఫ్‌.. టీంకు కృష్ణ కోచ్‌గా ఉంటే కాంపిటీషన్‌ లో పాల్గొనేందుకు ఛాన్స్‌ ఇస్తానని చెప్తాడు. (సాక్షి రివ్యూస్‌) అసలు యూసుష్‌కు కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి..? లక్ష్మీ టీంకు కోచ్‌గా ఉండేందుకు కృష్ణ ఒప్పుకున్నాడా..? లక్ష్మీ డాన్స్‌ కాంపిటీషన్‌లో పాల్గొంటున్న విషయం తెలిసి తల్లి నం‍దిని ఎలా రియాక్ట్ అయ్యింది.? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ ;
ప్రభుదేవా, కొవై సరళ లాంటి ఒకరిద్దరు తప్ప మిగతా నటీనటులంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తవారే. ఫస్ట్‌ హాఫ్‌ లో కాసేపు సత్యం రాజేష్ నవ్వించే ప్రయత్నం చేసిన రెండు మూడు సీన్స్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రధాన పాత్రలో ప్రభుదేవా అద్భుతం గా నటించాడు. అయితే గతంలో ప్రభుదేవా ఈ తరహా పాత్రలో చాలా సార్లు చూశాం అనిపిస్తుంది. మరో కీలక పాత్రలో కనిపించిన దిత్య డాన్సర్‌గానే కాదు నటిగానూ మంచి మార్కులు సాధించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌లో దిత్య నటన ఆకట్టుకుంటుంది. లక్ష్మీ తల్లి పాత్రలో ఐశ్వర్య రాజేష్‌ హుందాగా కనిపించారు. క్లైమాక్స్‌ సీన్స్‌లో మంచి ఎమోషన్స్‌ పండించారు. 

గతంలో డాన్స్‌ బేస్డ్ సినిమాలు చాలానే వచ్చాయి. ఆ సినిమాల ప్రభావం లక్ష్మీ మీద గట్టిగానే కనిపిస్తుంది. స్టైల్‌, డాడీ, ఏబీసీడీ లాంటి సినిమాలు ఛాయలు చాలా చోట్ల కనిపిస్తాయి. కథా కథనాల్లో పెద్దగా కొత్తదనం కనిపించకపోయినా డాన్స్‌ సీక్వెన్స్‌లు ఎంగేజింగ్ గా ఉన్నాయి. చాలా వరకు టీవీలో డాన్స్‌ రియాలిటీ షో చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది.

క్లైమాక్స్ లో మాత్రం దర్శకుడు విజయ్ తన మార్క్‌ చూపించాడు. బలమైన ఎమోషన్స్ పండించటంలో సక్సెస్‌ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే డాన్స్ సీక్వెన్స్ తో పాటు క్లైమాక్స్ లో లక్ష్మీకి యాక్సిడెంట్ అవ్వటం ఆ తరువాత స్టేజ్‌ మీద పర్ఫామ్ చేయటం లాంటి సీన్స్‌ కంటతడి పెట్టిస్తాయి. సంగీత దర్శకుడు సామ్ డాన్స్‌ బేస్డ్‌ సినిమాకు కావాల్సిన స్థాయి సంగీతమందించారు. నేపథ్య సంగీతంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన విషయం కొరియోగ్రఫి. దాదాపు అన్ని రకాల డాన్స్‌ ఫామ్స్‌ను పిల్లలతో చేయించారు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
డాన్స్‌ సీక్వెన్స్‌లు
ప్రభుదేవా, దిత్య
క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
రొటీన్‌ కథా కథనాలు
నేపథ్య సంగీతం

- సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top