‘సైలెన్స్’లో అనుష్క ఉండేది కాదట

తమిళసినిమా: సైలెన్స్ చిత్ర ప్రచారం మొదలయ్యింది. ఇది ఐదు భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగులో నిశ్శబ్దం పేరుతోనూ , తమిళం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో సైలెన్స్ పేరుతోనూ రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ నటి అనుష్క. దాదాపు రెండేళ్ల తరువాత ఆమె ముఖానికి రంగేసుకుని నటించిన చిత్రం సైలెన్స్. మాధవన్, నటి అంజలి. శాలినిపాండే తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. దీనికి టీజీ.విశ్వప్రసాద్, రచయిత కోన వెంకట్ నిర్మాతలు.
భాగమతి వంటి సంచలన చిత్రం తరువాత నటి అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో సైలెన్స్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా ఇందులో అనుష్క మూగ, చెవిటి యువతిగా నటించిందని సమాచారం. అసలు ఆ చిత్రంలో అనుష్క నటించి ఉండేదే కాదని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోనవెంకట్ అన్నారు. చిత్ర ప్రచారంలో ముమ్మరంగా ఉన్న ఈయన ఒక భేటీలో పేర్కొంటూ సైలెన్స్ చిత్ర కథను అసలు అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదని చెప్పారు. పలువురు నటీమనులను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఇదని చెప్పారు. అలా అనుష్కకు కూడా కథను చెప్పినట్లు తెలిపారు. ఆమె ఇందులో నటించడానికి ముందు అంగీకరించలేదని, ఆలోచించి చెబుతానని అన్నారన్నారు. ఆ తరువాత చాలా రోజుల వరకూ అనుష్క నుంచి బదులు రాకపోవడంతో వేరే నటిని నటింపజేయడానికి సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. అలాంటి సమయంలో అనుష్క నుంచి ఫోన్ వచ్చిందని, సైలెన్స్ చిత్రంలో తాను నటిస్తాను అని ఆమె చెప్పినట్లు తెలిపారు. ఆమె మరికాస్త ఆలస్యంగా చెప్పి ఉంటే ఈ చిత్రంలో ఉండేదే కాదని అన్నారు. కాగా సైలెన్స్ చిత్ర విడుదలకు తేదీ ఖరారు చేశారు. జనవరి 31న చిత్రాన్ని ఏక కాలంలో ఐదు భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి