హిట్‌ సినిమాకు పైరసీ విలన్‌

Kannada Film Industry Raises Voice Against Piracy - Sakshi

సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో ప్రత్యక్షం

శాండల్‌వుడ్‌కు పెద్ద తలనొప్పి

ఆరు నెలల్లో రూ. 20 కోట్ల నష్టాలు

ఎంత హిట్‌ సినిమా అయినా థియేటర్లలో ఆడితేనే నిర్మాతలకు కాస్త లాభం దక్కుతుంది. కానీ విడుదలకు ముందే, లేదా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో  ఆ సినిమా ప్రత్యక్షమైతే నిర్మాతలకు భారీ నష్టం, హీరో, దర్శకులు పడిన కష్టం గంగపాలు అవుతుంది.

తెలుగు, తమిళం, మలయాళం సినిమా రంగాలను వెంటాడిన పైరసీ భూతం ఇక ఇప్పుడు కన్నడ సినిమా రంగాన్నీ పీడిస్తోంది. ఈ పైరసీ భూతం వల్ల భారీ బడ్జెట్‌ సినిమాలకు పెను ఆటంకంగా మారింది. పోకిరీలు, ఆన్‌లైన్‌ నేరగాళ్లు గత ఆరేడు నెలల్లో హిట్‌ సినిమాలను పైరసీ చేసి ఆన్‌లైన్లో, సోషల్‌ మీడియాలో పెట్టడం వల్ల శాండల్‌వుడ్‌కు సుమారు రూ. 20 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సినీవర్గాల అంచనా. దీంతో ఇప్పుడిప్పుడే పైరసీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. 

పలు సినిమాలకు ఆటంకం
కేజీఎఫ్, యజమాన, కురుక్షేత్ర, పహిల్వాన్‌ తదితర కన్నడ చిత్రాలు పైరసీకి గురయి కలెక్షన్లను పోగొట్టుకున్నాయి. పైరసీని నివారించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో నిలువరించడం సాధ్యం కావడం లేదు. దీంతో కన్నడ చలనచిత్ర పరిశ్రమ పెద్దలకు దిక్కుతోచడం లేదు. కోట్లాది రూపాయలు పోసి సినిమా నిర్మిస్తే అది థియేటర్లకు చేరడానికి ముందే ఇంటర్నెట్లో దర్శనమివ్వడం, దాంతో కలెక్షన్లు పడిపోవడం దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతోంది.  

సైబర్‌ క్రైంకు ఫిర్యాదుల వెల్లువ
పైరసీపై చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసు అధికారులకు ఫిర్యాదులు వెల్లువలా అందుతున్నాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నా పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. పైరసీ నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులపై కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఒత్తిడి చేస్తోంది. ఇటీవల విడుదలైన పహిల్వాన్‌ చిత్రం పైరసీ కారణంగా సుమారు రూ. 5 కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకుందని సినిమా నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర్శన్‌ నటించిన యజమాన, కురుక్షేత్ర సినిమాలతో పాటు యష్‌ నటించిన కేజీఎఫ్‌ సినిమా కూడా పైరసీ బారిన పడ్డాయి. పైరసీ విషయంలో న్యాయ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కర్ణాటక వాణిజ్య మండలి నిర్ణయించింది. ఆ బృందం ఇచ్చే సలహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని తీర్మానించింది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక బృందాన్ని సిద్ధం చేసే పనిలో వాణిజ్య మండలి పడింది. మరోసారి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను కలసి పైరసీ నిందితులను కఠినంగా శిక్షించాలని ఒత్తిడి చేయాలని నిర్ణయించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top