జ్యోతికను చూస్తే నాకు గిల్టీగా ఉంటుంది | Sakshi
Sakshi News home page

జ్యోతికను చూస్తే నాకు గిల్టీగా ఉంటుంది

Published Tue, Aug 19 2014 12:41 AM

జ్యోతికను చూస్తే నాకు గిల్టీగా ఉంటుంది - Sakshi

 ‘‘జ్యోతిక మంచి ఇల్లాలు. భార్యగా, తల్లిగా, కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఏ పనినైనా పక్కా ప్రణాళికతో చేస్తుంది’’ అని తన భార్యను అభినందిస్తున్నారు సూర్య. భర్త నుంచి మంచి హోమ్ మేకర్ అనే కితాబు కొట్టేసిన జ్యోతిక నటిగా కూడా బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. కథానాయికగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే సూర్యని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే అది ఫుల్‌స్టాప్ కాదు, కామా మాత్రమే. ఎందుకంటే, త్వరలో జ్యోతిక రీ-ఎంట్రీ కానున్నారు. ఇప్పటికే ఆమె ఓ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు.
 
 దాదాపు ఏడెనిమిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇప్పుడు మళ్లీ నటించాలనుకోవడానికి కారణం ఏంటి? అనే ప్రశ్న సూర్య ముందుంచితే -‘‘మాకో పాప, బాబు అనే విషయం తెలిసిందే. పిల్లల సంరక్షణ కారణంగా జ్యోతిక వేరే దేని మీదా దృష్టి పెట్టలేకపోయింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్లు కావడంతో ఇక నిక్షేపంగా కెరీర్ కొనసాగించే అవకాశం లభించింది. వాస్తవానికి తను రీ-ఎంట్రీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, కొంతమంది దర్శక, నిర్మాతలు ‘మీరు నటించకపోయినా ఫర్వాలేదు.. కథ వింటే చాలు’ అనడంతో మొహమాటానికి కథలు వినేవాళ్లం. కథ విన్న తర్వాత సున్నితంగా తిరస్కరించాలన్నది మా అభిప్రాయం.
 
 కానీ, ఇటీవల విన్న ఓ కథను కాదనలేకపోయాం. అంత బాగుంది. దాంతో అంగీకరించాం. ఈ చిత్రం మాత్రమే కాదు.. త్వరలో మరో రెండు చిత్రాలు కూడా జ్యోతిక అంగీకరిస్తుంది’’ అని చెప్పారు. ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా జ్యోతికదేనని, తనే పర్‌ఫెక్ట్ అని సూర్య చెబుతూ -‘‘జ్యోతిక ప్రతిదీ కేలండర్‌లో రాసుకుంటుంది. పుట్టినరోజులు, పండగలు, ఇతర వేడుకలు ఏదైనా సరే.. ముందే ఆ విషయాల్లో ప్లాన్ చేసేసుకుంటుంది. నాకంత ప్లానింగ్ ఉండదు. అందుకే, తనని చూసి నేర్చుకుంటున్నాను. పిల్లలకు తల్లీతండ్రీ అన్నీ తానై ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తుందో స్వయంగా చూస్తున్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గిల్టీగా ఉంటుంది. అందుకే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. జ్యోతిక కారణంగా రాను రాను నేను కూడా ‘బెటర్ పర్సన్’ కాగలుగుతున్నాను’’ అని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement