క్వాలిటీ కోసమే విడుదల వాయిదా

Dil Raju confirms the new release date for Maharshi - Sakshi

‘‘మహర్షి’ చిత్రం షూటింగ్‌ తుదిదశలో ఉంది. ఈనెల 17 నాటికి రెండు సాంగ్స్, కొన్ని మాంటేజెస్‌ మినహా చిత్రీకరణ పూర్తవుతుంది. రెండు పాటల్ని సెట్‌ వేసి తీస్తాం. మాంటేజ్‌ సన్నివేశాలను అబుదాబీలో చిత్రీకరిస్తాం. ఏప్రిల్‌ 12కి సాంగ్స్‌తో సహా సినిమా మొత్తం పూర్తవుతుంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయిక. ‘అల్లరి’ నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోంది. నిర్మాతల్లో ఒకరైన ‘దిల్‌’ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘ఈ కథ కోసం వంశీ రెండేళ్లు కష్టపడ్డాడు. సినిమా బాగా వచ్చింది. యూనిట్‌ అంతా చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాం. అశ్వినీదత్‌గారు, నేను, పివీపీగారు సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. ఏప్రిల్‌ 25న సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి కావడానికి సమయం పడుతుండటంతో నేను, మహేశ్, వంశీ.. టీమ్‌ అంతా కలిసి మాట్లాడుకున్నాం. క్వాలిటీలో రాజీపడకుండా హైటెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ సినిమాను మే 9న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నాం. అదే రోజున అశ్వినీదత్‌గారి ‘జగదేకవీరుడు–అతిలోకసుందరి, మహానటి’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ విడుదలయ్యాయి. మేలో మా బేనర్‌ ద్వారా ‘ఆర్య, పరుగు, భద్ర’ వంటి సూపర్‌హిట్స్‌ అందుకున్నాం. ఇలా సెంటిమెంట్‌గా కూడా కలిసొచ్చింది.

మహేశ్‌గారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీస్‌గా ‘మహర్షి’ నిలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యానర్‌లో ‘ఎఫ్‌2’ తో బ్లాక్‌బస్టర్‌ కొట్టాం. ఈ సమ్మర్‌కి కూడా ‘మహర్షి’తో బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. ‘ఒక్కడు, పోకిరి, శ్రీమంతుడు’ సినిమాల తరహాలో ఈ సినిమాలో నావల్‌ పాయింట్‌ ఉంటుంది. సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడు మన వంతుగా ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో వస్తాడు’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: కె.యు.మోహనన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top