సామజవరగమన పాట గంటలోనే రాశా

Behind Story Of Samajavaragamana Song - Sakshi

పాటతత్త్వం

సిరివెన్నెల సీతారామశాస్త్రి: అలవైకుంఠపురములో చిత్రం కోసం ఈ పాటను గంట లోపుగానే పూర్తి చేసి ఇచ్చాను. ఏ పాటనైనా, ఏ అంశాన్నయినా సుకుమారంగా మాత్రమే రాయాలని మొదటి నుంచి నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. మూలాల్లోకి చూడగలగటం, ప్రతి చిన్న విషయాన్ని కొత్తగా ఆలోచించే లక్షణం మా నాన్నగారి పెంపకంలో వచ్చింది. ఎటువంటి పరిస్థితిలోనూ స్త్రీలోని బాహ్య సౌందర్యాన్ని కాకుండా దైవత్వం మాత్రమే చూడాలన్నదే నా లక్ష్యం. ఈ మధ్యకాలంలో నేను ఏ పాట రాసినా అలాగే భావన చేస్తున్నాను. ఈ పాటలోని సాహిత్యాన్ని కొంచెం లోతుగా చూస్తే, ఒక పాపాయిని చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. ‘మంజుల హాసం, మలెల్లమాసం, విరిసిన పింఛం, విరుల ప్రపంచం’ అన్ని పదాలూ సౌకుమార్యంతో నిండినవే. ముగ్ధత్వం నిండిన అమ్మాయిని, పువ్వుల పాపను చూస్తే ఎలాంటి భావన రావాలో, ఒక యవ్వనంలో ఉన్న యువతిని చూసినప్పుడు కూడా అదే భావన రావాలి. సౌందర్యాన్ని చూసే విధానంలో ఆబ ఉండకూడదు. అలా చూస్తే స్త్రీత్వాన్ని అవమానించినట్లు అవుతుంది. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అన్నప్పుడు, పట్టీలు పెట్టుకున్న నా మనవరాలి వెనుక నేను పరుగెడుతున్నట్లు నాకు భావన కలుగుతుంది. అంతర్లీనంగా ఆ అర్థం కూడా వస్తుంది. యవ్వనంలో ఉండే అమ్మాయిలో ఉండే అమాయకత్వం ముగ్ధత్వం, పెద్దపెద్ద కళ్లతో లోకాన్ని చూస్తున్నప్పుడు వికృతమైన ఆలోచనలు రాకూడదని నా తలపు.

‘‘నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు/నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు’’ అంటే నా వల్లే నీలో జరుగుతున్న అజ అంటే చేష్టలు ఇవి. అవి నా వల్ల వస్తున్నాయి. నడుచుకుంటూ వెడుతున్నప్పుడు తొక్కేసినట్టుగా అనిపిస్తుంది. నీ కళ్ల ఎరుపు నీకు సంబంధించినది కాదు, ‘నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు/నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు’. ఆడవారు నుదుటి మీద పడిన ముంగురులను చాలా సుకుమారంగా, చేతితో వెనక్కు తీసుకుంటారు. అలా పైకి తీయటం, కళ్లు నులుముకోవటం, కులుకుతూ నడవటం.. ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తాయి అంటాడు హీరో. స్త్రీ భావన పట్ల అంతర్లీనంగా ఉన్న ముగ్ధత్వం ఇందులో చూపాను. 
స్త్రీ గురించి వర్ణించేటప్పుడు, టీజింగ్‌గా కాకుండా, ప్లీజింగ్‌గా రాయాలి అనుకున్నాను.
శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్లు పట్టుకున్నాడంటే, అందులో ఉన్న సుకుమార శృంగారాన్ని చూడాలే కాని, అందులోని కోపాన్ని చూడకూడదు. అలాంటిదే ఈ పాట కూడా. డ్యూయెట్‌ రాసేటప్పుడు స్త్రీ గురించి వర్ణించాల్సి వచ్చినప్పుడు ఆ లిమిటేషన్‌ పెట్టుకుంటాను.. కాముకత ఉట్టిపడేట్టు అస్సలు రాయను.

తనకు సుపీరియర్‌గా పనిచేస్తున్న ఒక అమ్మాయిని చూసినప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. ‘ఏంటలా చూస్తున్నారు అని బాస్‌ అడగగానే, మీ కాళ్లు బావున్నాయండీ అంటాడు. బాస్‌ని అయినా, భగవంతుడిని అయినా ముందుగా కాళ్లనే చూస్తాం. ఇలా కాళ్లను చూస్తున్న సిట్యుయేషన్‌లో నేనేం చెప్పగలనా అని ఆలోచించాను. అలా పుట్టింది ఈ పాట.
నాకు పెద్దగా పుస్తక పాండిత్యం లేదు. నేను రాసే పాటలకు ఎవరూ ప్రేరణ కాకపోవటమే ప్రేరణ. ఎవరి రచనలనైనా చదివితే వాళ్ల ఆలోచనతోనే ఆలోచిస్తాం. ప్రబంధ కావ్యాలు చదివేసి ఉంటే, వసంతమాసం అనగానే అందరి కవుల ఆలోచనలు వచ్చేస్తాయి.  నేను అందరూ చూసే సంవిధానం నుంచి విలక్షణంగా చూడటం అలవాటు చేసుకున్నాను. నా నిర్వచనాలలోనే ఉంది నా జీవితం.

మనకు జన్మనిచ్చింది స్త్రీ. మనం మాట్లాడటానికి కారణభూతమైనది స్త్రీ. ఆవిడ పట్ల ఎంతో గౌరవం ఉండాలి. అంతర్లీనంగా ఉన్న దివ్య అంటే దైవ సంబంధమైన సౌందర్యాన్ని మాత్రమే చూడాలి. రాముడిలా బతకగలిగితే పురుషుడు కూడా సౌందర్యంగా ఉంటాడు. గుణాలు సౌందర్యంగా ఉండాలి. చిన్నపిల్లలు కాళ్లు ఆడిస్తున్నప్పుడు చూస్తే అక్కడే సౌందర్యం ఉంటుంది. చూపు ఎలా ఉండాలన్నదే నా పాటలకు ముఖ్యంగా పెట్టుకున్న లక్ష్యం. నేను చూసే దృక్కోణంలో పరిస్థితులను తీసుకునే సంవిధానం వేరే ఉంటుంది. అందం, సౌందర్యం అనేవి దైవత్వంలో ఒక లక్షణం. మనం చూసే దృష్టి మారితేనే చెడు ఆలోచనలు వస్తాయి. స్త్రీని పవిత్రంగా చూడాలి. సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఆ కాలంలో ఏ దృష్టి కోణంలో ఎలా చూసేవారు. ఈ కాలంలో ఎలా చూస్తున్నారో పరిశీలించుకోవాలి. శరీరంలో తేడా లేదు. చూసే విధానంలోనే తేడా ఉంది. ‘‘స్త్రీలు ఇంకొకరి కంటి ఆకలికి ఆరాధనగా కనపడాలి, ఆహారంగా కనపడకూడదు. వారిలోని మానసిక సౌందర్యాన్ని చూడాలి’’ అనేదే నా భావన. అందుకే ఏ పాటనైనా లా రాయాలి అన్నది నాకు నేను నిర్దేశించుకున్నాను.

పూర్తి పాట మీకోసం

పల్లవి: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావల కాస్తాయి కాటుకలా నా కలలు 
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్ఠూరపు విలవిలలు 
సామజవరగమనా నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా

చరణం: మల్లెల మాసమా మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా
విరిసిన పింఛమా విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె ఎన్నగ వశమా
అరె నా గాలే తగిలినా నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బతిమాలినా ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top