నా విజయ సూత్రం అదే..

సోమాజిగూడ: ‘హైదరాబాద్ రాగానే నాలో తెలియని ఆనందం వస్తుంది. నెలలో 19 రోజులు సూట్‌కేసు జీవితమే.. తాజ్ కృష్ణలో మకాం. హైదరాబాద్‌లో నా ఇల్లు అదే’.. అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హోటల్ ది పార్కులో ‘లీడింగ్ టుమారో, ఫ్రమ్ టుడే’ అనే అంశంపై ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆశిష్ విద్యార్థి మాటల్లోనే..
‘‘జీవితంలో ఏదీ ఈజీగా రాదు. కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అదే నేను పాటిస్తున్న సూత్రం. నేటి యువత కూడా అదే పాటించాలి. ఇప్పటిదాకా 11 భాషల్లో 230కి పైగా చిత్రాల్లో నటించా. అందులో చాలావరకు తెలుగు సినిమాలే. నేను పుట్టింది కేరళ, పెరిగింది ఢిల్లీ. నివాసం మాత్రం ముంబై. మా కుటుంబంలో నేను ఒక్కడినే మగ బిడ్డను. నాకూ ఒక్క కుమారుడే సంతానం. పుల్లారెడ్డి స్వీట్స్‌లో గవాపూరి అంటే చాలా ఇష్టం.హైదరాబాద్ షూటింగ్‌కు వచ్చినప్పుడు అది ఇష్టంగా తింటా’’ అంటూ ముగించారు.
వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా..
సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఆశిష్ విద్యార్థి అందుకు భిన్నంగా తన అభిరుచి మేరకు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానూ సేవలందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా విప్రో, ఓల్టాస్ వంటి ప్రముఖ సంస్థల్లోని ఉద్యోగులకు జీవితంలో ఎలా మసులుకోవాలి.. ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నారు. అందులో భాగంగానే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి