చావులోనూ జంటగా ప్రేమ పక్షులు

Badru And Kulsum Nanji Eternal Love - Sakshi

వారిద్దరి మధ్యా ఉన్న ప్రేమను చూసి కాలానికి ఈర్శ్య పుట్టింది. విధితో కుమ్మకై.. ఇద్దరిలా కాకుండా ప్రతిక్షణం ఒకరై బ్రతుకుతున్న ఆ జంటను వేరుచేయాలని చూసింది. కానీ, ఆ జంట మధ్య బంధం అమరమైనది తెలిసి సిగ్గుతో తలదించుకుంది.

బద్రు, కుల్‌సుమ్‌ నాంజిలు కెనడా శరణార్థులుగా ఒకరికొకరు పరిచయమై ప్రేమలో పడ్డారు. ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత బలపర్చారు. పిల్లాపాపలతో సంతోషంగా గడిపారు. చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది. బద్రు 91, కుల్‌సుమ్‌ 82 ఏళ్ల పడిలోకి అడుగుపెట్టారు. వయసు మనషులకే కానీ, మనసు కాదని వారు నిరూపించారు. అంత ముసలి తనంలోనూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఒకరి గురించి ఒకరు శ్రద్ధ తీసుకునేవారు. కలిసి తినేవారు, దేవున్ని ప్రార్థించేవారు.. ఒకరు లేకుండా ఒకరు ఒక్కక్షణం కూడా ఉండేవారు కాదు. ప్రతిరోజూ ఎదురెదురు సోఫాల్లో కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకునేవారు. కుల్‌సుమ్‌కు 78 ఏళ్లు ఉన్నప్పుడు ఓ దురదృష్టకరమైన వార్త తెలిసింది. ఆమె లుకేమియాతో బాధపడుతోందని, కొన్ని నెలలు మాత్రమే బ్రతుకుతుందని తెలిసింది. కానీ, ఇద్దరి మధ్యా ప్రేమ నెలల చావును దూరంగా తరిమేసింది. అలా ఐదేళ్లు సంతోషంగా గడిపేశారిద్దరూ.

కుల్‌సుమ్‌ నాంజి, బద్రు(ఫైల్‌)
కొద్దిరోజుల తర్వాత కుల్‌సుమ్‌ ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు రావటంతో ఆమెను హాస్పిటల్‌లో చేర్పించారు. ఆరోగ్యం బాగోలేక మంచంపై ఉన్నా కుల్‌సుమ్‌ మాత్రం బద్రు గురించి ఆలోచించటం మానలేదు. ప్రతిసారి బద్రు క్షేమసమాచారాన్ని పిల్లల్ని అడిగి తెలుసుకునేది. అయితే కుల్‌సుమ్‌ చివరిరోజుల్లో బద్రు ఆమె దగ్గర ఉంటే మంచిదని భావించిన వారి పిల్లలు అతడ్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లటానికి ప్రయత్నించారు. అతడు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ‘‘ నేను ఇళ్లు వదిలి రావటం లేదు. మీ అమ్మ(కుల్‌సుమ్‌‌) ఇక్కడే ఉంది. మేమిప్పుడే ప్రార్థనలు చేశాము. అదిగో తను గదిలో నిద్రపోతోంది. నేను ఆమెను వదిలి బయటకు రాను’’ అన్నాడు. వాళ్లు అతడ్ని ఒప్పించటానికి ఎంత ప్రయత్నించినా అతడు ససేమీరా అన్నాడు. 

చివరి రోజుల్లో కుల్‌సుమ్‌ నాంజి, బద్రు(ఫైల్‌)
వాళ్లుండే ఇంటికి సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్‌లో కుల్‌సుమ్‌ కన్నుమూసింది. తండ్రికి ఆ విషయం ఎలా చెప్పాలా అని కొడుకు కరీమ్‌ ఆలోచనల్లో పడిపోయాడు. చెప్పకుండా ఉంటేనే మంచిదని భావించాడు. అలా ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టాడు. ఎదురుగా బద్రు నేలపై కూర్చుని ఉన్నాడు. ఎక్కడైతే భార్యాభర్తలిద్దరూ సోఫాల్లో ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకునేవారో అక్కడ. కరీమ్‌ మెల్లగా తండ్రి దగ్గరకు నడిచాడు. బద్రు దగ్గరికి వెళ్లగానే అతడికి అర్థమైంది! తండ్రి ప్రాణాలతో లేడని.

ఒకరికోసం ఒకరు బ్రతికారు.. కలిసి బ్రతికారు.. విడిపోవాలని వారు కల్లో కూడా అనుకోలేదు.. అది చావైనా కూడా.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top