కలహాల ‘కాంగ్రెస్‌’ | clashes in congress | Sakshi
Sakshi News home page

కలహాల ‘కాంగ్రెస్‌’

Feb 6 2018 5:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

clashes in congress - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం : వర్గ పోరుతో కాంగ్రెస్‌ పార్టీ విలవిలలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీ ఉమ్మడి జిల్లాలో ఐక్యతారాగం ఆలపించలేకపోతోంది. మూడు గ్రూపులు.. ఆరు విభేదాలు అన్న చందంగా ఉంది పార్టీ పరిస్థితి. కార్యకర్తలకు ఉన్న నిబద్ధత.. కలిసికట్టుగా పనిచేసే విషయంలో నేతల మధ్య లేకపోవడం తమకు తలనొప్పిగా మారిందనే భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో పార్టీ బలోపేతమయ్యే సూచనలున్నా.. నేతలు మాత్రం ఎవరికి వారే యమునాతీరే అనే రీతిన వ్యవహరిస్తూ.. కొన్ని నియోజకవర్గాలపై మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి.. మరికొన్నింటిని నిర్లక్ష్యం చేస్తున్నారని.. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వివిధ నియోజకవర్గాల్లోని ద్వితీయ శ్రేణి కాంగ్రెస్‌ నేతలు గగ్గోలు పెడుతున్నారు.

కొందరు ద్వితీయ శ్రేణి నేతలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఆది నుంచి కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్న వర్గాలు మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా అధిగమించి మంచి రోజులు వస్తాయన్న భావనతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన ముఖ్య నేతలు కార్యకర్తలను సైతం గ్రూపుల వారీగానే గుర్తిస్తుండటం.. ఒకరి వద్దకు వెళ్తే మరొకరికి కంటగింపుగా మారడం.. వారికి జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సభలు, సమావేశాలకు కార్యకర్తలు వర్గ రహితంగా హాజరవుతున్నా.. కొందరు ముఖ్య నేతలు మాత్రం వర్గాలవారీగానే జన సమీకరణ చేసి జిల్లాలో తమ పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఏ సభకు వెళ్తే ఏం తంటానో..? వెళ్లకపోతే ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని అయోమయ పరిస్థితి తమదని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదింటికి.. నాలుగు..

ఉమ్మడి జిల్లాలో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10 స్థానాలకు.. నాలుగు స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. పాలేరు నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన మధిర ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క ఒక్కరే ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సత్తుపల్లి, వైరా, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పార్టీ మళ్లీ జవసత్వాలు పుంజుకునే అవకాశం ఉన్నా.. నాయకత్వం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో స్థానిక నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, శాసన మండలి ఉప నాయకుడిగా జిల్లాకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలిగా రేణుకా చౌదరి కాంగ్రెస్‌ నుంచి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి జిల్లాలో అనేక పర్యటనలు చేస్తున్న సందర్భంలో.. భట్టి విక్రమార్క జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలోనూ కార్యకర్తలు హాజరవుతున్నా.. ఒక వర్గం సమావేశానికి మరో వర్గం దూరంగా ఉంటోందని, తమకు సమాచారం లేదని ఒక వర్గం చెబుతుండగా.. తమను ఆహ్వానించడం లేదని మరో వర్గం ఆయా సమావేశాలకు దూరంగా ఉంటుండటంతో కాంగ్రెస్‌లో వర్గ పోరుకు అద్దం పడుతోంది. రేణుకా చౌదరి ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు హాజరైనా.. భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడైన డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యంతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కాలేదు. ఇదే తరహాలో మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోనూ.. ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో రేణుక వర్గం దూరంగా ఉంటోందని కాంగ్రెస్‌ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

జిల్లాలో కాంగ్రెస్‌కు ఉజ్వల భవిష్యత్‌ ఉందన్న ఆలోచనతో పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నా.. ఏ వర్గంలో మనగలుగుతామో..? ఎవరితో ఇమడ గలుగుతామో..? తేల్చుకోలేక వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ నాయకుడు పోట్ల నాగేశ్వరరావు మాజీ మంత్రి రేణుకా చౌదరి నేతత్వంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతూ.. ఆ పార్టీ నుంచి ఖమ్మం, పాలేరు, వైరా, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట వంటి నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు.

‘కొత్త’లో కుతకుత!

ఇక కాంగ్రెస్‌కు గట్టి పట్టుకున్న కొత్తగూడెం నియోజకవర్గంలోనూ పార్టీ వర్గ పోరుతో కుతకుతలాడుతోంది. అక్కడ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మరో కాంగ్రెస్‌ నేత ఎడవల్లి కృష్ణ వేర్వేరు శిబిరాలు ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తుండటం.. ప్రతి కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా వంటి గిరిజన నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలను కన్నెత్తి చూసే నాయకుడే లేరని, ఇప్పటివరకు పార్టీ బలంగా ఉన్నా.. తమ నాయకుడు ఎవరో తెలియని పరిస్థితి అక్కడి కార్యకర్తల్లో ఉంది. ఇల్లెందు నుంచి గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హరిప్రియ కాంగ్రెస్‌లో చేరగా.. ఆమె ఇల్లెందు టికెట్‌ ఆశిస్తున్నారు.

అలాగే భూక్యా దళ్‌సింగ్‌ సైతం ఈసారి ఇల్లెందు టికెట్‌పై ఆశలు పెట్టుకుని.. తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఖమ్మం నియోజకవర్గంపై అనేక మంది ప్రముఖులు కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోని నేతలతోపాటు చిరకాలంగా పార్టీలో కొనసాగుతున్న నేతలు, ఇందుకోసమే పార్టీలో చేరిన నేతలు అనేక మంది ఈ స్థానాన్ని ఆశిస్తుండటంతో ఖమ్మం రాజకీయం రసకందాయంలో పడింది. పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌ పోటీ చేస్తారని ఆయన అనుచరులు ఆశిస్తుండగా.. అదే నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ కందాల ఉపేందర్‌రెడ్డి ఈసారి టికెట్‌ కోసం భారీస్థాయిలో ప్రయత్నం చేస్తూ.. క్షేత్రస్థాయిలో ఇప్పటికే కార్యకర్తలతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ సభలు ఎక్కడ పెట్టినా విజయవంతం అవుతున్నాయని, నేతల వైఖరి వల్ల ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక తారుమారైతే ఎన్నికల ఫలితాల్లో తేడా వచ్చే అవకాశం ఉందని, పార్టీ కోసం పనిచేసే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం జిల్లా కాంగ్రెస్‌ పరిస్థితిపై దృష్టి సారించి నేతలను ఏకతాటిపై నడిపించేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఖమ్మం జిల్లాకు ముగ్గురు నేతలతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో ఈ కమిటీని నియమించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement