మలేషియా పీఎం కంటే మోదీనే ఎక్కువ ఇష్టం!

Zakir Naik will not be Sent Back to India, Says Malaysia PM - Sakshi

మలేషియా హిందువులపై జకీర్‌ నాయక్‌ అనుచిత వ్యాఖ్యలు

ఆయన్ను వెంటనే దేశం నుంచి తరిమేయాలని డిమాండ్‌ 

కౌలాలంపూర్‌: ప్రస్తుతం మలేషియాలో తలదాచుకుంటున్న వివాదాస్పద ఇస్లామిక్‌ మత ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ ఆ దేశంలోని హిందువులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. మలేషియా హిందువులను కించపరిచిన జకీర్‌ను వెంటనే భారత్‌కు అప్పగించాలని డిమాండ్‌ వెల్లువెత్తుతున్నప్పటికీ.. మలేషియా ప్రధాని మాత్రం దానిని తోసిపుచ్చారు. జకీర్‌ నాయక్‌ను భారత్‌కు అప్పగిస్తే.. ఆయనకు ముప్పు వాటిల్లుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 

మలేషియా హిందువులు తమ దేశ ప్రధాని కంటే భారత ప్రధాని నరేంద్రమోదీకే ఎక్కువ విధేయంగా ఉంటున్నారని జకీర్‌ నాయక్‌ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మలేషియా మానవ వనరులశాఖ మంత్రి ఎం కులశేఖరన్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనను వెంటనే భారత్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మలేషియా వ్యవహారాల్లో జోక్యం చేసుకొని.. స్థానిక కమ్యూనిటీలపై అనుమానాలు లేవనెత్తేలా మాట్లాడే హక్కు జకీర్‌కు లేదని కులశేఖరన్‌ తేల్చిచెప్పారు. అయితే, ఆయనను భారత్‌కు అప్పగించాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన మలేషియా ప్రధాని మహాథిర్‌ బిన్‌ మహమ్మద్‌.. వేరే ఇతర దేశాలు కోరుకుంటే.. ఆయనను పంపిస్తామని చెప్పారు. ఉగ్రసంస్థలకు నిధులు అందించడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్‌ నాయక్‌ ప్రస్తుతం మలేషియాలో పర్మనెంట్‌ రెసిడెంట్‌గా తలదాచుకుంటున్నాడు. అతన్ని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top