చైనా దగ్గర తుపాకులున్నాయి. కానీ.. : దలైలామా

We Have the Power of Truth: the Dalai Lama - Sakshi

పాట్నా: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా బౌద్ధ గురువు దలైలామా బుధవారం చైనానుద్దేశించి సందేశం ఇచ్చారు. ‘మా వద్ద సత్యం ఉంది. కమ్యూనిస్టు చైనా వద్ద తుపాకులు, ఆయుధాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలంలో ఆయుధ శక్తి మీద సత్యమే గెలుస్తుంది. ప్రపంచంలోనే బౌద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా ఒకటి. అక్కడి బౌద్ధులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తాము నమ్మే బౌద్ధమే నిజమైనదనే అభిప్రాయానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. దలైలామా ప్రస్తుతం బీహార్‌లోని బుద్ధగయలో ఉన్నారు. జనవరి 6న జరిగే బోధిసత్వునికి సంబంధించిన కార్యక్రమంలో దాదాపు 50వేల మంది బౌద్ధులనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దలైలామాను అనుసరించే చైనా బౌద్ధుల్లో అధిక శాతం మంది చైనా వెలుపలే ఉన్నారు.

కాగా, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 1959లో భారతదేశానికి శరణార్థిగా వచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కొండ ప్రాంతమైన ధర్మశాలలో ఆయన నివాసముంటున్నారు. కానీ, చైనా మాత్రం దలైలామాను టిబెట్‌ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగా గుర్తిస్తోంది. మరోవైపు తదుపరి దలైలామా ఎవరనే విషయంలో సాంప్రదాయాన్ని కొనసాగించాలని చైనా పట్టుబడుతుండగా, టిబెట్లు మాత్రం చైనా చేస్తోన్న ఒత్తిడిని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై దలైలామా స్పందిస్తూ.. తదుపరి దలైలామా ఎవరనే దానిపై బయట ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? ఇప్పుడు నాకు 85 ఏళ్లయినా ఆరోగ్యంగానే ఉన్నాను కదా..అంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత దలైలామాను కనుగొనడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top