ఇక మీదట విడాకులు తీసుకోవడానికి కూడా సోషల్ మీడియా వేదిక కానుంది.
న్యూయార్క్: సోషల్ మీడియా ద్వారా పరిచయమై ప్రేమికులుగా, భార్యాభర్తలుగా మారిన సంఘటనల గురించి ఎన్నో విన్నాం. ఇక మీదట విడాకులు తీసుకోవడానికి కూడా సోషల్ మీడియా వేదిక కానుంది. అమెరికాలోని మన్హాటన్ కోర్టు ఫేస్బుక్ ద్వారా విడాకులు నోటీసు పంపడానికి అనుమతి మంజూరు చేసింది.
2009లో ఎలనొర బైడో అనే నర్సు, విక్టర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం ఎలనొరను విడిచి విక్టర్ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే ఫేస్బుక్ ద్వారా ఆమెతో టచ్లో ఉంటున్నాడు. విక్టర్తో విడిపోవాలని నిర్ణయించుకున్న ఎలనొర భర్తను కలసి విడాకులు నోటీసు ఇవ్వాలని ప్రయత్నించింది. అతని ఆచూకీ లభించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. ఫేస్బుక్ ద్వారా విడాకుల నోటీసు పంపేందుకు మన్హాటన్ కోర్టు జడ్జి మథ్యూ కూపర్ అనుమతిచ్చారు.