
నిజం చెప్పిన ఆస్ట్రేలియా పీఎంకు థ్యాంక్స్: ట్రంప్
పుండుమీద కారంజల్లి వెన్నముద్ద తినిపించినట్లుంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ను తొలుత చెడమడా తిట్టి ఇప్పుడు బుజ్జగింపు చర్యలకు దిగారు.
వాషింగ్టన్: పుండుమీద కారంజల్లి వెన్నముద్ద తినిపించినట్లుంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం. ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ను తొలుత చెడమడా తిట్టి ఇప్పుడు బుజ్జగింపు చర్యలకు దిగారు. అంతకంటే ముందు టర్న్‌బుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి ఆయన నిజాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని, కానీ, మీడియానే వాటిని వక్రీకరించిందంటూ గుర్రుమన్నారు.
మరోపక్క, గతంలో శరణార్థుల విషయంలో అమెరికాతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకుందామని హామీ ఇస్తూ అమెరికా పరిపాలన వర్గానికి చెందిన ఇద్దరు ఉన్నత సలహాదారులు ట్రంప్ స్టాఫ్ చీఫ్ రెయిన్స్ ప్రీబస్, మరో సీనియర్ సలహాదారు స్టీవ్ బ్యానన్‌ను ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రతినిధి వద్దకు పంపించారు. ఈ వివరాలు వారిద్దరే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తాము ఆస్ట్రేలియా ప్రతినిధి జో హాకీతో కూడా భేటీ అయ్యి వివరాలు తెలియజేసినట్లు చెప్పారు.
ఒబామా హయాంలో కుదుర్చుకున్న శరణార్థుల ఒప్పందంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌తో వాగ్వాదానికి దిగి మధ్యలోనే ఫోన్ పెట్టేశారు. అధ్యక్షుడయ్యాక వరుసగా ప్రపంచదేశాల అధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్... ఇంతవరకూ తాను మాట్లాడిన ఫోన్ కాల్స్‌లో ఇదే అత్యంత చెత్తదిగా పేర్కొన్నారంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది.
ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు. అలాగే ఇరాన్ విషయంలో కూడా స్పందిస్తూ తాను నిప్పుతో ఆడుకుంటుందన్న విషయం ఇరాన్ మర్చిపోతుందంటూ గట్టిగా మందలించారు. ఇరాన్ అణు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తుండటంతోపాటు తాము కూడా అమెరికన్లపై ఆంక్షలు విధిస్తామని చెప్పిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
మరిన్ని సంబంధిత కథనాలకు చదవండి..
(ఇదెక్కడి ‘ట్రంపు’ నోరు!)
(దేశ ప్రధానికి ఫోన్ చేసి షాక్ ఇచ్చిన ట్రంప్!)
(‘మాది ఒబామా సర్కార్ కాదు.. సంగతి తేలుస్తాం’)
(డోనాల్డ్ ట్రంప్ రికార్డు ఢమాల్)