డోనాల్డ్ ట్రంప్ రికార్డు ఢమాల్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిపై ప్రజలు సహజంగానే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిపై ప్రజలు సహజంగానే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలు ఆవిరై ఆయన పట్ల అవిశ్వాసం వ్యక్తం చేయడానికి కొన్ని వారాలే కాదు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. ఈ విషయంలో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో దేశాధ్యక్షుల రికార్డులన్నింటినీ బద్దలుకొట్టారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కేవలం ఎనిమిదంటే ఎనిమిది రోజుల్లోనే ప్రజల అవిశ్వాసాన్ని మూటగట్టుకున్నారు.
50 శాతం ప్రజల విశ్వాసం కోల్పోవడానికి బిల్ క్లింటన్‌కు 573 రోజులు పట్టగా, సీనియర్ జార్జిబుష్‌కు 1,336 రోజులు పట్టింది. బరాక్ ఒబామాకు 936 రోజులు పట్టింది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన పట్ల 45 శాతం మంది విశ్వాసం ప్రకటించగా, 45 మంది అవిశ్వాసం వ్యక్తం చేశారు. పది శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు.
అధికార బాధ్యతలు స్వీకరించి మెక్సికో సరిహద్దులో గోడ కడతానని ప్రకటించడం, హెల్త్‌కేర్ చట్టాన్ని రద్దు చేయడం, అబార్షన్ చట్టాన్ని మార్చడం, ఏడు ముస్లిం దేశాలకు చెందిన ప్రజల రాకపోకలపై నిషేధం విధించడంతో ఆయన పట్ల అవిశ్వాసం ఒక్కసారిగా 51 శాతానికి పెరిగిందని ‘గాలప్ పోల్’ ఓ ప్రకటనలో తెలిపింది.