
వాషింగ్టన్: డెల్టాఫోర్స్ ఆపరేషన్‌లో ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీతోపాటు, అతని తర్వాత ఐసిస్ పగ్గాలు చేపట్టనున్న మరో ఉగ్రవాది హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సిరియాలోని స్థావరంపై శనివారం రాత్రి ప్రత్యేక బలగాలు దాడి చేయడంతో బాగ్దాదీ తనను తాను పేల్చేసుకున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో బాగ్దాదీ తరువాతి స్థానంలో ఉన్న మరోవ్యక్తి హతమయ్యాడని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అతడి పేరు, ఎలా చనిపోయాడన్న వివరాలను వెల్లడించలేదు.
బాగ్దాదీ మృతిపై అమెరికా సైనిక బలగాల అధిపతి జనరల్ మార్క్ మిల్లీ మాట్లాడుతూ..‘ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో లభించిన శరీర భాగాలపై డీఎన్‌ఏ పరీక్ష జరిపి అవి బాగ్దాదీవే అని నిర్ధారించుకున్నాకే అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల మేరకు అంత్యక్రియలు పూర్తి చేశాం’అని తెలిపారు. అయితే, ఈ ఘటన ఫుటేజీని కొంత బయటకు వెల్లడిస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. మొత్తం ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపారు. బాగ్దాదీ ఇద్దరు అనుచరులను పట్టుకున్నామని, దీంతోపాటు ఆ భవనంలో లభించిన ఐసిస్ కీలక పత్రాల విశ్లేషణ కొనసాగుతోందన్నారు.
ఆపరేషన్ ఇంకా ఉంది: అమెరికా
బాగ్దాదీని మట్టుబెట్టిన అనంతరం సిరియాలో అమెరికా బలగాలు మరో ప్రత్యేక ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టాయి. చమురు క్షేత్రాలకు ఐసిస్ నుంచి రక్షణ కల్పించడంతోపాటు అక్కడి అసద్ ప్రభుత్వ, రష్యా బలగాల స్వాధీనం కాకుండా చూడడం తాజా లక్ష్యమని రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ప్రకటించారు.