చెప్పకూడని విషయం 20సార్లు చెప్పింది

Trump Attorney Accuses Daniels  - Sakshi

ఆమె ట్రంప్‌కు 20 మిలియన్‌ డాలర్లు కట్టాల్సిందే

కోర్టులో ట్రంప్‌ తరుపు అటార్నీ కోర్టులో దావా

నిజం దాచిపెట్టేందుకే బెదిరింపులన్న డానియెల్‌

న్యూయార్క్‌ : తనకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో శారీరక సంబంధం ఉందంటూ ఆరోపించిన పోర్న్‌స్టార్‌ స్టామీ డానియెల్‌పై ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాది ఒకరు రంగంలోకి దిగారు. రహస్యంగా ఉంచాల్సిన ఓ విషయాన్ని పదేపదే బయటపెట్టి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరువు తీసేందుకు ప్రయత్నించిన డానియెల్‌పై కోర్టులో ఈ మేరకు ఓ దావా వేశారు. దాదాపు 20సార్లు ఆమె అదే విషయాన్ని బయటకు చెప్పి ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకుగాను ఆమె నుంచి 20 మిలియన్‌ డాలర్లు తీసుకొనే హక్కు తమకు ఉందని, ఆ మేరకు ఆదేశించాలంటూ కోర్టును కోరారు.

అంతేకాకుండా అలాంటి విషయాలు ప్రైవేటువని, అవి బహిరంగం చేయాల్సినవి కావని ఈ మేరకు డానియెల్‌కు నొక్కి చెప్పాలని కూడా పేర్కొన్నారు. రహస్యంగా జరగాల్సిన ప్రొసీడింగ్స్‌ను మధ్యవర్తిత్వానికి అప్పగించేందుకు కూడా తాను సిద్ధమని తెలిపారు. అయితే, మైకెల్‌ అవెనట్టి అనే డానియెల్‌ తరుపు న్యాయవాది నష్టం పేరిట తమ క్లెయింట్‌ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లాగేసుకునేందుకు ట్రంప్‌, ఆయన న్యాయవాది కొహెన్‌ ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నారని, ఈ ఒత్తిడి సాయంతో అసలు నిజాన్ని తొక్కిపట్టొచ్చని బయటకు రానివ్వకుండా చేయొచ్చన్నది వారి వ్యూహం అని ఆరోపించారు.

'అమెరికా ప్రజలకు తెలియకుండా నిజం దాచేందుకే వారు ఈ పనిచేస్తున్నారు. ఏం జరిగిందో ప్రజలకు చెప్పడం తప్పే కాదు.. దానిని తప్పుగా చూపించి బోగస్‌ నష్టం పేరిట 20 మిలియన్‌ డాలర్లు అడుగుతున్నారు. బహుశా మన దేశ చరిత్రలోనే ఇలాంటిది జరగలేదు. ఏది ఏమైనా మేం భయపడబోం. ఎవరి బెదిరింపులకు వెనక్కి తగ్గబోం' అని డానియెల్‌ తరుపు న్యాయవాది చెప్పారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top