breaking news
Michael Cohen
-
నేరమా? దుష్ప్రవర్తనా?
వివాహేతర సంబంధాన్ని దాచివుంచడానికి అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా 2016లో డోనాల్డ్ ట్రంప్ ఒక మహిళకు డబ్బు ఇచ్చారనే విషయంలో పెద్ద సందేహాలేమీ లేవు. కానీ ఆ ప్రయత్నాలు ప్రత్యేకించి శిక్షాస్మృతిని కూడా ఉల్లంఘించాయా అన్నది కఠిన ప్రశ్న. న్యూయార్క్ రాష్ట్ర చట్టాలను కూడా అవి ఉల్లంఘించాయనే ఆరోపణల ప్రాతిపదికన న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‌పై 34 నేరాలతో కూడిన అభియోగ పత్రం మోపింది. ఈ సంఖ్య కేసు బలం గురించి పేర్కొనలేదు. ప్రాసిక్యూటర్ల వాదన బలమైనదా, కాదా అనే దానిపై ఆధారపడి ఇవి పెరుగుతాయి లేదా తగ్గిపోతాయి. 2016లో అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలబడిన డోనాల్డ్ ట్రంప్, తన వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టకుండా రహస్యంగా ఉంచడానికి, ఆ వ్యవహారంలో పాల్గొన్న మహిళకు డబ్బు చెల్లించి ఆమె నోరు మూయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిపై పెద్దగా సందేహించాల్సిందేమీ లేదు. అయితే ట్రంప్ గురించిన నిజాన్ని ఓటర్లు తెలుసుకోకుండా ఉంచడానికి అధ్యక్ష అభ్యర్థి, ఆయన మిత్రులు వ్యవహరించిన తీరు ఒక అవినీతి ప్రయత్నంగా నిలిచింది. కొత్త సాక్ష్యాలు లేవు నిజానికి, ఆ ప్రయత్నాలు ప్రత్యేకించి శిక్షాస్మృతిని కూడా ఉల్లంఘించాయా అన్నది కఠిన ప్రశ్న. న్యూయార్క్ రాష్ట్ర చట్టాలను అవి ఉల్లంఘించాయనే ఆరోపణల ప్రాతిపదికన న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‌పై 34 నేరాలతో కూడిన అభియోగ పత్రం మోపింది. ఈ నేరాభియోగం కలవరం కలిగించింది. అలాగని ఈ కేసు ప్రాసిక్యూటర్లు ఓడిపోతారని నేను చెప్పడం లేదు. దీంట్లో వారు గెలవొచ్చు, గెలవాలనే భావిస్తున్నాను. ఎందుకంటే, నేరారోపణను నిర్ధారించడంలో వైఫల్యం ట్రంప్‌ను, ఆయన మద్దతుదారులను మరింత రెచ్చగొడుతుంది. తమకు వ్యతిరేకంగా శిక్షాస్మృతి కోరలు పెంచుతున్నారని ట్రంప్ మద్దతుదారులు ఇప్పటికే ప్రకటిస్తు న్నారు కూడా! అయితే అభియోగపత్రంలో దాగిన వాస్తవాలకు సంబంధించి పదే పదే చెబుతున్న విషయాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కొత్త సాక్ష్యాలనూ చూపించడం లేదు. ‘పోర్న్ స్టార్’ స్టార్మీ డేనియల్స్, ‘ప్లేబాయ్’ మాజీ మోడల్ కరెన్ మెక్డౌగల్లతో తనకు ఉన్న సంబంధాల గురించిన సమాచారాన్ని కప్పి పుచ్చడానికి ట్రంప్ ఎన్నుకున్న ‘క్యాచ్ అండ్ కిల్’ పథకాలకు సంబంధించిన పసలేని వివరాలు ఇప్పటికే విస్తృతంగా మీడియాలో ప్రసారమయ్యాయి. 34 అనేది సంఖ్య మాత్రమే! ట్రంప్ తరఫున డేనియల్స్‌కు నగదు చెల్లించినట్లు ట్రంప్ మధ్యవర్తి మైఖేల్ కొహెన్ అంగీకరించి న్యాయస్థానంలో క్షమా భిక్షను కోరారు. ఆ చెల్లింపులు చట్టబద్ధమైనవే అని తప్పుగా వర్ణించి, 1,30,000 డాలర్ల భారీ డబ్బును ఆమెకు చెల్లించినట్లు కొహెన్ ఒప్పుకొన్నారు. ఇతర ఆరోపణలతోపాటు... అమెరికా ఫెడరల్ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించాననీ, ప్రత్యేకించి చట్ట విరుద్ధంగా కార్పొరేట్ సహకారాన్ని అందించాననీ అంగీకరించారు. సహకారం విషయంలో ఉన్న పరిమితులను దాటి నగదు రూపంలో వారికి చెల్లించినట్లు కూడా అంగీకరించారు. అయితే ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. కొహెన్‌ను ప్రాసిక్యూట్ చేసినప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండేవారు. కాబట్టి న్యాయవిభాగం ట్రంప్‌ను విచారించలేదు. ట్రంప్ గద్దె దిగిన తర్వాత కూడా ఆ విచారణను చేపట్టలేదు. న్యూయార్క్ ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు ఇలాంటి ప్రవర్తనను నేరచర్యగా మార్చగలరా అనే ప్రశ్నకు ఇది అవకాశమిచ్చింది. 34 నేరాలు అనడం గురించి మీరు దారి తప్పవద్దు. ఈ సంఖ్య కేసు బలం గురించి పేర్కొనలేదు. ప్రాసిక్యూటర్ల కేసు థియరీ బల మైనదా కాదా అనే దానిపై ఆధారపడి ఇవి పెరుగుతాయి లేదా తగ్గిపోతాయి. విచిత్రమైన స్థితి ఈ కేసుల థియరీ: బిజినెస్ రికార్డులను తప్పుగా మార్చడాన్ని న్యూయార్క్ చట్టం నేరంగా పేర్కొంటోంది. సాధారణంగా ఇది కేవలం దుష్ప్రవర్తన మాత్రమే. అయితే మోసగించే ఉద్దేశ్యంతో, మరొక నేరాన్ని దాచి ఉంచే ఉద్దేశ్యంతో ఇలా ఉన్న పరిస్థితిని మార్చి చెప్పినట్లయితే, అలాంటి చర్య తప్పకుండా నేరంగా మారుతుంది. ఈ కేసులో వాస్తవంగా జరిగింది ఇదేనని మన్ హాటన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్ చెబుతున్నారు. సరే. ట్రంప్ దాచి ఉంచారని చెబుతున్న ఇతర నేరాలు ఏమిటి? నేరాభియోగ పత్రం దీనిపై ఏమీ చెప్పలేదు. కానీబ్రాగ్ కొన్ని అంశాలను ప్రతిపాదించారు. మార్చిన రికార్డులు న్యూయార్క్ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనీ, తప్పుడు ప్రకటనలు చేయడంతో సహా, ఇది చట్టవిరుద్ధ మార్గాల్లో ఒక అభ్యర్థిత్వాన్ని ప్రోత్సహించడానికి చేసిన కుట్రపూరిత నేరమేననీ చెప్పారు. కార్పొరేట్ సహకార పరివతులపై ఫెడరల్ ఎన్నికల చట్టం పరిమితి విధించిందని కూడా ఆయన గుర్తు చేశారు. నేను బ్రాగ్ వాదనను సరిగా అర్థం చేసుకుని ఉన్నట్లయితే– కార్పొరేట్ పుస్తకాలపై తప్పుడు ప్రకటన చేయడం నేరమే తప్ప అది దుష్ప్రవర్తనగా ఉండబోదన్న విషయంలో ఒక విచిత్రమైన వర్తులం ఉంది. ఎందుకంటే తప్పుడు ప్రకటనలు చేయడం వంటి చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అభ్యర్థిత్వాన్ని ప్రమోట్ చేయడం దుష్ప్రవర్తన కిందికి వస్తుందని ప్రభుత్వ ఎన్నికల చట్టం నిర్దేశించింది. అంతకుమించి, ఒక విషయం స్పష్టం కావడం లేదు. ఫెడరల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు (ట్రంప్ అలా చేశారని రుజువైనప్పటికీ) ట్రంప్‌పై ఆరోపించిన దుష్ప్రవర్తన... నేరమే నని రుజువు చేయడం సాధ్యమవుతుందా అన్నది! ఎటూ, రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని ఫెడరల్ ఎన్నికల చట్టం తోసివేస్తుందని ట్రంప్ న్యాయవాదులు వాదిస్తారు. ఏమైనా ఈ కేసుకు సంబంధించి బ్రాగ్ వాదన దృఢంగా రూపొందవచ్చు. రూపొందకపోవచ్చు కూడా! కానీ అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై మోపిన మొట్టమొదటి నేరాభియోగం ఒక భయానక పరిస్థితిని çసృష్టించినట్లు కనిపిస్తోంది. రూత్ మార్కస్ వ్యాసకర్త అసోసియేట్ ఎడిటర్ (‘ద వాషింగ్టన్ పోస్ట్’ సౌజన్యంతో) -
అదిరిపోయే ట్విస్ట్: రాసలీలలపై మరో సాక్ష్యం!
ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్(46).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనతో రాసలీలలు నడిపారని సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ట్రంప్ తనతో లైంగిక సంబంధం కొనసాగించినట్లు ఆమె ఆరోపించటమే కాదు.. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొని కలకలమే రేపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు బయటకు రావటం చర్చనీయాంశంగా మారింది. వాషింగ్టన్: ట్రంప్.. తన మాజీ అటార్నీ మైకేల్ కోహెన్‌తో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. కరెన్ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్ కుదుర్చుకోవాలని కోహెన్‌కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. ‘ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలన్నా.. కరెన్‌ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’.. అని ట్రంప్ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్ బదులిచ్చినట్లు క్లిప్‌లో ఉన్నట్లు సదరు కథనం సారాంశం. ట్రంప్ టవర్లోనే ఈ సంభాషణ జరగ్గా.. 90 సెకన్ల ఆ సంభాషణను కోహెన్ ముందు జాగ్రత్తగా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోహెన్‌పై ఎన్నికల అవినీతి, అక్రమాస్థుల కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఏజెంట్లు కోహెన్ కార్యాలయాల నుంచి ఆ టేపులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ కథనం వివరించింది. నిజమే కానీ... ఇక ఈ వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ స్పందించారు. ఆ సంభాషణ నిజమే అయినప్పటికీ.. ఆమెతో ఎలాంటి ఒప్పందం జరగలేదని రూడీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోవని రూడీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2006లో ట్రంప్ తనతో అఫైర్ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ ఆరోపణలు చేశారు.. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె.. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆమె పేర్కొన్నారు. -
చెప్పకూడని విషయం 20సార్లు చెప్పింది
న్యూయార్క్ : తనకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో శారీరక సంబంధం ఉందంటూ ఆరోపించిన పోర్న్‌స్టార్ స్టామీ డానియెల్‌పై ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఒకరు రంగంలోకి దిగారు. రహస్యంగా ఉంచాల్సిన ఓ విషయాన్ని పదేపదే బయటపెట్టి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేందుకు ప్రయత్నించిన డానియెల్‌పై కోర్టులో ఈ మేరకు ఓ దావా వేశారు. దాదాపు 20సార్లు ఆమె అదే విషయాన్ని బయటకు చెప్పి ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకుగాను ఆమె నుంచి 20 మిలియన్ డాలర్లు తీసుకొనే హక్కు తమకు ఉందని, ఆ మేరకు ఆదేశించాలంటూ కోర్టును కోరారు. అంతేకాకుండా అలాంటి విషయాలు ప్రైవేటువని, అవి బహిరంగం చేయాల్సినవి కావని ఈ మేరకు డానియెల్‌కు నొక్కి చెప్పాలని కూడా పేర్కొన్నారు. రహస్యంగా జరగాల్సిన ప్రొసీడింగ్స్‌ను మధ్యవర్తిత్వానికి అప్పగించేందుకు కూడా తాను సిద్ధమని తెలిపారు. అయితే, మైకెల్ అవెనట్టి అనే డానియెల్ తరుపు న్యాయవాది నష్టం పేరిట తమ క్లెయింట్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లాగేసుకునేందుకు ట్రంప్, ఆయన న్యాయవాది కొహెన్ ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నారని, ఈ ఒత్తిడి సాయంతో అసలు నిజాన్ని తొక్కిపట్టొచ్చని బయటకు రానివ్వకుండా చేయొచ్చన్నది వారి వ్యూహం అని ఆరోపించారు. 'అమెరికా ప్రజలకు తెలియకుండా నిజం దాచేందుకే వారు ఈ పనిచేస్తున్నారు. ఏం జరిగిందో ప్రజలకు చెప్పడం తప్పే కాదు.. దానిని తప్పుగా చూపించి బోగస్ నష్టం పేరిట 20 మిలియన్ డాలర్లు అడుగుతున్నారు. బహుశా మన దేశ చరిత్రలోనే ఇలాంటిది జరగలేదు. ఏది ఏమైనా మేం భయపడబోం. ఎవరి బెదిరింపులకు వెనక్కి తగ్గబోం' అని డానియెల్ తరుపు న్యాయవాది చెప్పారు.