నేరమా? దుష్ప్రవర్తనా? | Sakshi Editorial On Donald Trump Issue | Sakshi
Sakshi News home page

నేరమా? దుష్ప్రవర్తనా?

Apr 9 2023 12:20 AM | Updated on Apr 9 2023 7:41 AM

Sakshi Editorial On Donald Trump Issue

వివాహేతర సంబంధాన్ని దాచివుంచడానికి అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిగా 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక మహిళకు డబ్బు ఇచ్చారనే విషయంలో పెద్ద సందేహాలేమీ లేవు. కానీ ఆ ప్రయత్నాలు ప్రత్యేకించి శిక్షాస్మృతిని కూడా ఉల్లంఘించాయా అన్నది కఠిన ప్రశ్న. న్యూయార్క్‌ రాష్ట్ర చట్టాలను కూడా అవి ఉల్లంఘించాయనే ఆరోపణల ప్రాతిపదికన న్యూయార్క్‌ గ్రాండ్‌ జ్యూరీ ట్రంప్‌పై 34 నేరాలతో కూడిన అభియోగ పత్రం మోపింది. ఈ సంఖ్య కేసు బలం గురించి పేర్కొనలేదు. ప్రాసిక్యూటర్ల వాదన బలమైనదా, కాదా అనే దానిపై ఆధారపడి ఇవి పెరుగుతాయి లేదా తగ్గిపోతాయి.

2016లో అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా నిలబడిన డోనాల్డ్‌ ట్రంప్, తన వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టకుండా రహస్యంగా ఉంచడానికి, ఆ వ్యవహారంలో పాల్గొన్న మహిళకు డబ్బు చెల్లించి ఆమె నోరు మూయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనిపై పెద్దగా సందేహించాల్సిందేమీ లేదు. అయితే ట్రంప్‌ గురించిన నిజాన్ని ఓటర్లు తెలుసుకోకుండా ఉంచడానికి అధ్యక్ష అభ్యర్థి, ఆయన మిత్రులు వ్యవహరించిన తీరు ఒక అవినీతి ప్రయత్నంగా నిలిచింది. 

కొత్త సాక్ష్యాలు లేవు
నిజానికి, ఆ ప్రయత్నాలు ప్రత్యేకించి శిక్షాస్మృతిని కూడా ఉల్లంఘించాయా అన్నది కఠిన ప్రశ్న. న్యూయార్క్‌ రాష్ట్ర చట్టాలను అవి ఉల్లంఘించాయనే ఆరోపణల ప్రాతిపదికన న్యూయార్క్‌ గ్రాండ్‌ జ్యూరీ ట్రంప్‌పై 34 నేరాలతో కూడిన అభియోగ పత్రం మోపింది. ఈ నేరాభియోగం కలవరం కలిగించింది. 

అలాగని ఈ కేసు ప్రాసిక్యూటర్లు ఓడిపోతారని నేను చెప్పడం లేదు. దీంట్లో వారు గెలవొచ్చు, గెలవాలనే భావిస్తున్నాను. ఎందుకంటే, నేరారోపణను నిర్ధారించడంలో వైఫల్యం ట్రంప్‌ను, ఆయన మద్దతుదారులను మరింత రెచ్చగొడుతుంది. తమకు వ్యతిరేకంగా శిక్షాస్మృతి కోరలు పెంచుతున్నారని ట్రంప్‌ మద్దతుదారులు ఇప్పటికే ప్రకటిస్తు న్నారు కూడా!

అయితే అభియోగపత్రంలో దాగిన వాస్తవాలకు సంబంధించి పదే పదే చెబుతున్న విషయాలు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎలాంటి కొత్త సాక్ష్యాలనూ చూపించడం లేదు. ‘పోర్న్‌ స్టార్‌’ స్టార్మీ డేనియల్స్, ‘ప్లేబాయ్‌’ మాజీ మోడల్‌ కరెన్‌ మెక్‌డౌగల్‌లతో తనకు ఉన్న సంబంధాల గురించిన సమాచారాన్ని కప్పి పుచ్చడానికి ట్రంప్‌ ఎన్నుకున్న ‘క్యాచ్‌ అండ్‌ కిల్‌’ పథకాలకు సంబంధించిన పసలేని వివరాలు ఇప్పటికే విస్తృతంగా మీడియాలో ప్రసారమయ్యాయి.

34 అనేది సంఖ్య మాత్రమే!
ట్రంప్‌ తరఫున డేనియల్స్‌కు నగదు చెల్లించినట్లు ట్రంప్‌ మధ్యవర్తి మైఖేల్‌ కొహెన్‌ అంగీకరించి న్యాయస్థానంలో క్షమా భిక్షను కోరారు. ఆ చెల్లింపులు చట్టబద్ధమైనవే అని తప్పుగా వర్ణించి, 1,30,000 డాలర్ల భారీ డబ్బును ఆమెకు చెల్లించినట్లు కొహెన్‌ ఒప్పుకొన్నారు. ఇతర ఆరోపణలతోపాటు... అమెరికా ఫెడరల్‌ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించాననీ, ప్రత్యేకించి చట్ట విరుద్ధంగా కార్పొరేట్‌ సహకారాన్ని అందించాననీ అంగీకరించారు.

సహకారం విషయంలో ఉన్న పరిమితులను దాటి నగదు రూపంలో వారికి చెల్లించినట్లు కూడా అంగీకరించారు. అయితే ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు ఆనాడు ట్రంప్‌పై ఎలాంటి ఆరోపణలూ చేయలేదు. కొహెన్‌ను ప్రాసిక్యూట్‌ చేసినప్పుడు ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉండేవారు. కాబట్టి న్యాయవిభాగం ట్రంప్‌ను విచారించలేదు. ట్రంప్‌ గద్దె దిగిన తర్వాత కూడా ఆ విచారణను చేపట్టలేదు.

న్యూయార్క్‌ ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు ఇలాంటి ప్రవర్తనను నేరచర్యగా మార్చగలరా అనే ప్రశ్నకు ఇది అవకాశమిచ్చింది. 34 నేరాలు అనడం గురించి మీరు దారి తప్పవద్దు. ఈ సంఖ్య కేసు బలం గురించి పేర్కొనలేదు. ప్రాసిక్యూటర్ల కేసు థియరీ బల మైనదా కాదా అనే దానిపై ఆధారపడి ఇవి పెరుగుతాయి లేదా తగ్గిపోతాయి. 

విచిత్రమైన స్థితి
ఈ కేసుల థియరీ: బిజినెస్‌ రికార్డులను తప్పుగా మార్చడాన్ని న్యూయార్క్‌ చట్టం నేరంగా పేర్కొంటోంది. సాధారణంగా ఇది కేవలం దుష్ప్రవర్తన మాత్రమే. అయితే మోసగించే ఉద్దేశ్యంతో, మరొక నేరాన్ని దాచి ఉంచే ఉద్దేశ్యంతో ఇలా ఉన్న పరిస్థితిని మార్చి చెప్పినట్లయితే, అలాంటి చర్య తప్పకుండా నేరంగా మారుతుంది. ఈ కేసులో వాస్తవంగా జరిగింది ఇదేనని మన్‌ హాటన్‌ జిల్లా అటార్నీ అల్విన్‌ బ్రాగ్‌ చెబుతున్నారు. 

సరే. ట్రంప్‌ దాచి ఉంచారని చెబుతున్న ఇతర నేరాలు ఏమిటి? నేరాభియోగ పత్రం దీనిపై ఏమీ చెప్పలేదు. కానీబ్రాగ్‌ కొన్ని అంశాలను ప్రతిపాదించారు. మార్చిన రికార్డులు న్యూయార్క్‌ ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయనీ, తప్పుడు ప్రకటనలు చేయడంతో సహా, ఇది చట్టవిరుద్ధ మార్గాల్లో ఒక అభ్యర్థిత్వాన్ని ప్రోత్సహించడానికి చేసిన కుట్రపూరిత నేరమేననీ చెప్పారు. కార్పొరేట్‌ సహకార పరివతులపై ఫెడరల్‌ ఎన్నికల చట్టం పరిమితి విధించిందని కూడా ఆయన గుర్తు చేశారు.

నేను బ్రాగ్‌ వాదనను సరిగా అర్థం చేసుకుని ఉన్నట్లయితే– కార్పొరేట్‌ పుస్తకాలపై తప్పుడు ప్రకటన చేయడం నేరమే తప్ప అది దుష్ప్రవర్తనగా ఉండబోదన్న విషయంలో ఒక విచిత్రమైన వర్తులం ఉంది. ఎందుకంటే తప్పుడు ప్రకటనలు చేయడం వంటి చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అభ్యర్థిత్వాన్ని ప్రమోట్‌ చేయడం దుష్ప్రవర్తన కిందికి వస్తుందని ప్రభుత్వ ఎన్నికల చట్టం నిర్దేశించింది.

అంతకుమించి, ఒక విషయం స్పష్టం కావడం లేదు. ఫెడరల్‌ చట్టాన్ని ఉల్లంఘించినట్లు (ట్రంప్‌ అలా చేశారని రుజువైనప్పటికీ) ట్రంప్‌పై ఆరోపించిన దుష్ప్రవర్తన... నేరమే నని రుజువు చేయడం సాధ్యమవుతుందా అన్నది! ఎటూ, రాష్ట్ర ప్రభుత్వ చట్టాన్ని ఫెడరల్‌ ఎన్నికల చట్టం తోసివేస్తుందని ట్రంప్‌ న్యాయవాదులు వాదిస్తారు.

ఏమైనా ఈ కేసుకు సంబంధించి బ్రాగ్‌ వాదన దృఢంగా రూపొందవచ్చు. రూపొందకపోవచ్చు కూడా! కానీ అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై మోపిన మొట్టమొదటి నేరాభియోగం ఒక భయానక పరిస్థితిని çసృష్టించినట్లు కనిపిస్తోంది.

రూత్‌ మార్కస్‌ 
వ్యాసకర్త అసోసియేట్‌ ఎడిటర్‌
(‘ద వాషింగ్టన్ పోస్ట్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement