దిగొచ్చిన ట్రంప్ సర్కార్ ‌: వారికి భారీ ఊరట

Trump Administration Reverses Controversial Rule Barring Many Foreign Students - Sakshi

వివాదాస్పద ఆదేశాల ఉపసంహరణ  

లక్షలాది మంది విదేశీ విద్యార్థులకు ఊరట

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలి వివాదాస్పద నిర్ణయంపై  వెనక్కి తగ్గారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులకు షాక్ ఇస్తూ గత నెలలో తీసుకొచ్చిన ఆర్డర్లను తాజాగా రద్దు చేశారు. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఆదేశాలను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. తద్వారా లక్షలాది విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. (ఆన్‌లైన్‌ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!)

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైతే, విదేశీ విద్యార్థులు దేశంలోఉండటానికి వీల్లేదని,  అమెరికా విడిచి వెళ్లాల్సిందేనంటూ చేసిన జులై 6 నాటి ప్రకటన జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యే వారికి వీసాలు  జారీ చేయబోమని ప్రకటించి పెద్ద దుమారాన్ని రేపింది. నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా ఎఫ్‌-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న వారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఐసీఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అటు ప్రతిపక్షం,  ఇటు అమెరికాలోని పలు యూనివర్శిటీలు విద్యార్థులు, టెక్‌ దిగ్గజాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వీటిని సవాలు చేస్తూ పలు వ్యాజ్యాలు కూడా దాఖలు చేశాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ సర్కారు దిగి రాక తప్పలేదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top