ఆన్‌లైన్‌ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!

Foreign Students Must Leave The Country Says Donald Trump - Sakshi

అగ్రరాజ్యం అమెరికా హుకుం!

లక్షలాది మంది విదేశీ విద్యార్థులపై ప్రభావం

న్యూయార్క్‌: ఒకవైపు హెచ్‌–1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా విద్యార్థులపై తన ఆంక్షల కొరడా ఝళిపించింది. కోవిడ్‌–19 నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాలు పూర్తిగా ఆన్‌లైన్‌ క్లాసులవైపు మొగ్గితే విదేశీ విద్యార్థులు వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని‘ద ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’(ఐసీఈ)ప్రకటించింది. ఒకవేళ విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లకపోతే బలవంతంగానైనా తరలిస్తామని, వర్సిటీ ఈ సెప్టెంబరులో ప్రారంభమయ్యే తరగతులను ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా మాత్రమే నిర్వహిస్తే ఇది తప్పదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ క్లాసులతో నడిచే కోర్సులకు ఇకపై వీసాల జారీ కూడా ఉండదని, సరిహద్దు రక్షణ విభాగం కూడా విద్యార్థులను దేశంలోకి అనుమతించరని ఐసీఈ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.

ఇప్పటికే వివిధ కోర్సుల్లో చేరిన విద్యార్థులు నేరుగా విద్యాబోధన చేసే చోటికి బదిలీ లేదా ఇతర చర్యలు తీసుకోవాలని సూచించింది. దీని ప్రభావం భారతీయ విద్యార్థులపై కూడా పడనుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు కోర్సును బట్టి ఎఫ్‌–1 లేదా ఎం–1 వీసా అవసరమవుతుంది. 2017–18 విద్యా సంవత్సరానికిగాను భారత్‌ నుంచి సుమారు 2.51 లక్షల మంది అమెరికాలో చదువుతూండగా చైనా నుంచి 4.78 లక్షల మంది విద్యార్థులు వేర్వేరు కోర్సుల్లో చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌తోపాటు ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహించే హైబ్రిడ్‌ కళాశాలు ఈ విషయాన్ని స్టూడెంట్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ అధికారులకు తెలియజేయాలని విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసేందుకు తగినన్ని ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందని ఐసీఈ స్పష్టం చేసింది.

ఐసీఈ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు వేలాది మంది విద్యార్థు్థల్లో ఆందోళనకు కారణమవుతోంది. కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్‌లోనే ప్రారంభం కానుండగా అదే సమయంలో ఈ కొత్త తరహా ఆంక్షలు అమల్లోకి రానుండటంతో కోర్సుల్లో చేరడం ఎలా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేప«థ్యంలో స్వదేశాలకు తిరిగి వెళ్లడమూ కష్టమవుతుందని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారం చేపట్టిన తరువాత ఇమిగ్రేషన్‌ విధానాల్లో పలు తీవ్ర మార్పులు చేసిన విషయం తెలిసిందే. గత నెల 22వ తేదీన హెచ్‌–1బీ, ఎల్‌–1, హెచ్‌–2బీ, జే–1 వీసాలపై డిసెంబర్‌ 31వ తేదీ వరకూ నిషేధం విధించారు.

యూఎస్‌ దృష్టికి భారత్‌ ఆందోళన 
ఆన్‌లైన్‌ క్లాస్‌లు మాత్రమే నిర్వహించే విశ్వవిద్యాలయాల్లో చదివే విదేశీ విద్యార్థుల వీసాలను ఉపసంహరిస్తామన్న అమెరికా ప్రకటనపై భారత్‌ ఆందోళన వెలిబుచ్చింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా మంగళవారం అమెరికా విదేశాంగ రాజకీయ వ్యవహారాల అండర్‌ సెక్రటరీ డేవిడ్‌ హేల్‌తో ఆన్‌లైన్‌ భేటీ సందర్భంగా లేవనెత్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌ ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారని, అమెరికాలోని భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం తక్కువగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపాయి. ఈ నిర్ణయానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని చెప్పాయని వివరించాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top