తైవాన్‌పై చైనా పెత్తనం.. భారత్‌ సాయం కావాలి!

Taiwan Envoy Hopeful Of Support From India At WHO Amid WHA Meet - Sakshi

హక్కులు కాపాడుకునేందుకు భారత్‌ సాయం కావాలి

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనాపై పోరులో భారత్‌ తమకు మద్దతుగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు భారత్‌లో తైవాన్‌ రాయబారి(తైపీ ఎకనమిక్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌) చుంగ్‌- వాంగ్‌ తీన్‌ తెలిపారు. భారత్‌తో తమ విలువైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. తైవాన్‌ హక్కుల పరిరక్షణ విషయంలో భారత ప్రజలు, మేధావులు, మీడియా నుంచి తమకు గొప్ప మద్దతు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. కాగా మే 18-19 మధ్య జెనీవాలో జరిగే వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ(డబ్ల్యూహెచ్‌ఏ) జరుగనున్న నేపథ్యంలో చుంగ్‌ వాంగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోవిడ్‌-19‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఈ నెలలో నిర్వహించే డబ్ల్యూహెచ్‌ఏ సమావేశానికి తమకు ఆహ్వానం పంపలేదని తైవాన్‌ విదేశాంగ శాఖ ఇదివరకే పేర్కొన్న విషయం విదితమే. (డబ్ల్యూహెచ్‌ఓ ఆహ్వానం అందలేదు: తైవాన్‌)

వాస్తవానికి 2009-16 మధ్య కాలంలో తైవాన్‌ డబ్ల్యూహెచ్‌ఏ సమావేశాలకు హాజరైంది. ఈ క్రమంలో తమ భూభాగంలో ప్రాంతమైన తైవాన్‌ స్వతంత్రంగా మీటింగ్‌లకు హాజరుకావడం సరికాదంటూ చైనా డబ్ల్యూహెచ్‌ఓపై ఒత్తిడి పెంచింది. దీంతో 2017 నుంచి తైవాన్‌ ప్రాతినిథ్యంపై అంతర్జాతీయ సంస్థ ఆంక్షలు విధించింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ తమపై వివక్ష తగదంటూ తైవాన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థపై విమర్శలు గుప్పించింది. తమ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిందిగా కోరింది. అయితే ఈ విషయంలో ఎటువంటి స్పందనా రాకపోడంతో వివిధ దేశాల మద్దతు కూడగట్టే పనిలో పడింది.(తైవాన్‌ డబ్ల్యూహెచ్‌ఓపై విషం కక్కుతోంది: చైనా)

ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాలు చైనాకు వ్యతిరేకంగా తైవాన్‌కు అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ మీటింగ్‌ తేదీ సమీపించిన తరుణంలో ఇండియా టుడేతో మాట్లాడిన చుంగ్‌ వాంగ్‌.. ఈ విషయంలో భారత్‌ సహాయాన్ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ హక్కులను కాపాడుకోవడంతో భారత్‌ మద్దతుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా అసంబద్ధ వాదనల గురించి స్పందిస్తూ.. ‘‘తైవాన్‌, చైనా వేర్వేరు పరిధిలోకి వస్తాయి. ఎవరూ ఎవరికి సబార్డినేట్లు కారు. చైనా ఒత్తిడి వల్ల డబ్ల్యూహెచ్‌ఓ మాపై ఆంక్షలు విధించడం సరికాదు’’అని విమర్శించారు. ఇక కరోనా వుహాన్‌ ల్యాబ్‌ నుంచే ఉద్భవించిందని నిరూపించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో.. చైనా మేన్‌లాండ్‌లోని తైవాన్‌కు అగ్రరాజ్యం స్నేహహస్తం అందించడం గమనార్హం. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top