లంకలో వెల్లువెత్తిన రక్తదాతలు

Sri Lankans line up to donate blood to bomb blast survivors - Sakshi

బాధితులకు తమ రక్తం ఇచ్చేందుకు పోటీపడ్డ జనం

కొలంబో:  శ్రీలంకలో ఉగ్రవాదుల దుశ్చర్య వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. బాంబు దాడుల్లో గాయపడిన వారిలో చాలామందిని కొలంబో నేషనల్‌ హాస్పిటల్, బట్టికలోవా ఆసుపత్రులకు తరలించారు. ఆయా ఆసుపత్రుల్లో రక్తం నిల్వలు సరిపడా లేకపోవడంతో, బాధితులను రక్షించేందుకు వెంటనే రక్తదానం చేయాలంటూ శ్రీలంక నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ సర్వీస్‌ సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. రక్తదాన కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తమ రక్తం ఇచ్చేందుకు పోటీ పడ్డారు.

అంతేకాకుండా బాధితులకు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ తమ మిత్రులకు కూడా సమాచారం చేరవేశారు. ఫలానా గ్రూప్‌ రక్తం అత్యవసరంగా కావాలని పేర్కొంటూ చాలామంది ట్విట్టర్‌లో ట్వీట్లు చేశారు. రక్తంఇచ్చేందుకు వచ్చిన వారి ఫొటోలను షేర్‌ చేశారు. రాజధాని కొలంబోలోని నేషనల్‌ బ్లడ్‌ బ్యాంకు రక్తదాతలతో కిక్కిరిసిపోయింది. సమీపంలోని ఆసుపత్రులు, రక్తదాన కేంద్రాల్లో రక్తదానం చేయాలంటూ ముస్లింలకు ముస్లిం కౌన్సిల్‌ ఆఫ్‌ శ్రీలంక పిలుపునిచ్చింది. ఉగ్రదాడులను కొలంబో ఆర్చిబిషప్‌ మాల్కోమ్‌ కార్డినల్‌ రంజిత్‌ తీవ్రంగా ఖండించారు. రక్తదానం చేసి, క్షతగాత్రులకు అండగా నిలవాలని ప్రజలకు సూచించారు.  

క్యాన్సిలేషన్‌ చార్జీలు రద్దు చేసిన ఎయిర్‌ ఇండియా  
న్యూఢిల్లీ: ఉగ్రవాద దాడుల నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబో నుంచి భారత్‌కు ఈ నెల 24వ తేదీ వరకూ రాకపోకలు సాగించే తమ విమానాల్లో టికెట్ల క్యాన్సిలేషన్‌ చార్జీలను ఎయిర్‌ ఇండియా యాజమాన్యం రద్దు చేసింది. అలాగే రీషెడ్యూలింగ్‌ చార్జీలను సైతం వసూలు చేయబోమని ట్విట్టర్‌లో ప్రకటించింది. ఎయిర్‌ ఇండియా నిత్యం ఢిల్లీ నుంచి రెండు, చెన్నై నుంచి ఒక విమానాన్ని కొలంబోకు నడుపుతోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top