హెచ్‌-1 బీ వంటి వర్క్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం!

Report Says US Working On Temporary Ban On Visas Like H 1B - Sakshi

అమెరికాలో కొత్త వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం

వాషింగ్టన్‌: అమెరికాలోకి కొత్త వలసలపై తాత్కాలికంగా నిషేధం విధించే దిశగా ట్రంప్‌ సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరుద్యోగం పెరిగిన క్రమంలో.. కొత్తగా జారీ చేసే వర్క్‌ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధించాలని నిర్ణయించింది. ఇమ్మిగ్రేషన్‌ అడ్వైజర్స్‌ ఈ మేరకు విధివిధానాలు, ప్రణాళికలు రచిస్తున్నారని ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్‌-1 బీ‌, హెచ్‌-2 బీ వీసా సహా విద్యార్థి వీసాలపై కూడా దీని ప్రభావం పడనుందని వెల్లడించింది. ‘‘వర్క్‌ బేస్డ్‌ వీసాలపై తాత్కాలిక నిషేధం విధించేలా అధ్యక్షుడి ఇమ్మిగ్రేషన్‌ అడ్వైజర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ వీసాల జాబితాలో హెచ్‌-1 బీ, హెచ్‌-బీ, విద్యార్థి వీసాలు కూడా మమేకమై ఉంటాయి’’ అని పేర్కొంది. (హెచ్‌1బీ వీసాలు... తక్కువ జీతాలిచ్చేందుకే!)

కాగా కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లో నేపథ్యంలో తమ దేశంలోకి అన్ని రకాల వలసలపై తాత్కాలిక నిషేధం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని.. ఇది కేవలం గ్రీన్‌కార్డు కోరుకునే వారి​కి మాత్రమే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాలోని హెచ్‌1బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించే నిబంధనను తొలగించేలా ఆదేశాలివ్వవద్దని ట్రంప్‌ ప్రభుత్వం వాషింగ్టన్‌లోని ఫెడరల్‌ కోర్టును కోరింది. వారు ఉద్యోగాలు పొందడం వల్ల అమెరికన్ల ఉద్యోగావకాశాలు అంతగా ప్రభావితం కావడం లేదని న్యాయస్థానానికి తెలిపింది. హెచ్‌4 వీసాదారుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఏర్పడుతుందన్న ‘సేవ్‌ జాబ్స్‌ యూఎస్‌ఏ’వారి వాదన సరికాదని వాషింగ్టన్‌లోని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టుకు ట్రంప్‌ ప్రభుత్వం మే 5న వివరించింది. కాగా హెచ్‌-1 బీ వీసాతో దాదాపు 5 లక్షల మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే. (‘హెచ్‌4’ ఉద్యోగాలతో ముప్పేం లేదు!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top