హెచ్‌1బీ వీసాలు... తక్కువ జీతాలిచ్చేందుకే!

US Firms Use H-1B Visa to Pay Low Wages to Migrant Workers - Sakshi

అమెరికన్‌ సంస్థలపై నివేదిక

వాషింగ్టన్‌: స్థానిక ఉద్యోగులకన్నా తక్కువ జీతాలిచ్చి పనిచేయించుకునేందుకే చాలా మటుకు అమెరికన్‌ సంస్థలు హెచ్‌1బీ వీసాల మార్గాన్ని ఉపయోగించుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్‌ తదితర దిగ్గజ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశాల నుంచి ఉద్యోగులను హెచ్‌1బీ వీసాలపై అత్యధికంగా నియమించుకునే టాప్‌ 30 సంస్థలపై ఎకనమిక్‌ పాలసీ ఇనిస్టిట్యూట్‌ (ఈపీఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిర్దిష్ట నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో భారత్, చైనా వంటి దేశాల నుంచి నిపుణులను రిక్రూట్‌ చేసుకునేందుకు హెచ్‌1బీ వీసాలు ఉపయోగపడతాయి. అయితే, ఇలా నియమించుకున్న ఉద్యోగుల్లో దాదాపు 60 శాతం మందికి స్థానిక సగటు వేతనాల కన్నా కంపెనీలు తక్కువగా చెల్లిస్తున్నాయని ఈపీఐ పేర్కొంది.

నిపుణులని చెబుతున్నా పెద్దగా నైపుణ్యాలు అవసరం లేని, తక్కువ జీతాలుండే లెవెల్‌ 1 (ఎల్‌1), లెవెల్‌ 2 (ఎల్‌2) స్థాయి ఉద్యోగాల్లో సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి. లిస్టులో ఏడో స్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్‌.. సుమారు 77 శాతం మంది హెచ్‌1బీ ఉద్యోగులను ఎల్‌1, ఎల్‌2 స్థాయుల్లో నియమించుకుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న అమెజాన్‌డాట్‌కామ్‌ ఏకంగా 86 శాతం మంది హెచ్‌1బీ ఉద్యోగులను ఎల్‌1, ఎల్‌2 స్థాయిల్లో నియమించుకుంది. యాపిల్, గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థల్లోనూ దాదాపు ఇదే ధోరణి ఉన్నట్లు ఈపీఐ పేర్కొంది.  2019లో 53,000 కంపెనీలు హెచ్‌1బీ వీసాలను వినియోగించుకున్నాయి. మొత్తం 3,89,000 దరఖాస్తులు ఆమోదం పొందగా ప్రతి నాలుగింటిలో ఒకటి .. టాప్‌ 30 హెచ్‌1బీ కంపెనీలకి చెందినదే ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top