
శరీరం నుంచి విద్యుత్ ఉత్పత్తి
ఎర్రటి టీషర్ట్ మధ్యభాగంలో, పక్కనున్న వ్యక్తి మోచేతి పైభాగంలో ఉన్నవేంటో తెలుసా..! అవి విద్యుత్ జనరేటర్లు..
ఎర్రటి టీషర్ట్ మధ్యభాగంలో, పక్కనున్న వ్యక్తి మోచేతి పైభాగంలో ఉన్నవేంటో తెలుసా..! అవి విద్యుత్ జనరేటర్లు.. వాట్లకువాట్ల విద్యుత్తయితే ఉత్పత్తి చేయలేవు కానీ, శరీర ఉష్ణోగ్రతను కొన్ని మైక్రోవాట్ల విద్యుత్‌గా మార్చగలవు. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ వినూత్న థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్లను అభివృద్ధి చేశారు. ఇలాంటివి ఇప్పటికే కొన్ని ఉన్నప్పటికీ తాము అతి తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని అధిక విద్యుత్‌ను ఉత్పతి చేయగలిగామని అసోసియేట్ ప్రొఫెసర్ దార్‌యూష్ వాషీ తెలిపారు. శరీర ఉష్ణోగ్రతకు, పరిసరాల్లో ఉన్న వేడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఇవి పనిచేస్తాయని పేర్కొన్నారు.
గతంలో అభివృద్ధి చేసిన ఇలాంటి జనరేటర్లు ఒక చదరపు సెంటీమీటర్‌కు ఒక మైక్రోవాట్ విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలిగేవి. అయితే తాము 20 మైక్రోవాట్లు ఉత్పత్తి చేశామని చెప్పారు. పైగా తమ జనరేటర్లు చాలా తేలికగా ఉంటాయని వివరించారు. ఈ జనరేటర్లను పెద్దసైజులో తయారు చేస్తే వేరబుల్ గాడ్జెట్స్‌కు అవసరమైన విద్యుత్తును అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ అప్లయిడ్ ఎనర్జీ’లో ప్రచురితమయ్యాయి.