breaking news
University of North Carolina scientists
-
మరో కరోనా మహమ్మారి!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్–19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్–కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → మెర్స్–కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్‌లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్‌కేయూ5 వైరస్‌లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు. → సార్స్–కోవ్–2 అనే వైరస్ కోవిడ్–19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్‌కేయూ5 వైరస్లు స్పైక్ ప్రొటీన్ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు. → చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. → హెచ్‌కేయూ5 వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మైఖేల్ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
శరీరం నుంచి విద్యుత్ ఉత్పత్తి
ఎర్రటి టీషర్ట్ మధ్యభాగంలో, పక్కనున్న వ్యక్తి మోచేతి పైభాగంలో ఉన్నవేంటో తెలుసా..! అవి విద్యుత్ జనరేటర్లు.. వాట్లకువాట్ల విద్యుత్తయితే ఉత్పత్తి చేయలేవు కానీ, శరీర ఉష్ణోగ్రతను కొన్ని మైక్రోవాట్ల విద్యుత్‌గా మార్చగలవు. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ వినూత్న థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్లను అభివృద్ధి చేశారు. ఇలాంటివి ఇప్పటికే కొన్ని ఉన్నప్పటికీ తాము అతి తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని అధిక విద్యుత్‌ను ఉత్పతి చేయగలిగామని అసోసియేట్ ప్రొఫెసర్ దార్యూష్ వాషీ తెలిపారు. శరీర ఉష్ణోగ్రతకు, పరిసరాల్లో ఉన్న వేడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఇవి పనిచేస్తాయని పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి చేసిన ఇలాంటి జనరేటర్లు ఒక చదరపు సెంటీమీటర్‌కు ఒక మైక్రోవాట్ విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేయగలిగేవి. అయితే తాము 20 మైక్రోవాట్లు ఉత్పత్తి చేశామని చెప్పారు. పైగా తమ జనరేటర్లు చాలా తేలికగా ఉంటాయని వివరించారు. ఈ జనరేటర్లను పెద్దసైజులో తయారు చేస్తే వేరబుల్ గాడ్జెట్స్‌కు అవసరమైన విద్యుత్తును అక్కడికక్కడే తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ అప్లయిడ్ ఎనర్జీ’లో ప్రచురితమయ్యాయి.