భారత్, రష్యా భాయి–భాయి | Sakshi
Sakshi News home page

భారత్, రష్యా భాయి–భాయి

Published Fri, Oct 5 2018 3:59 AM

PM Modi hosts dinner for Russian President Putin - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వార్షిక ద్వైపాక్షిక భేటీలో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్వాగతం పలకగా మోదీ తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. పుతిన్‌ విమానాశ్రయంలో దిగిన అనంతరం మోదీ ఇంగ్లిష్, రష్యా భాషల్లో ట్వీట్‌  చేస్తూ ‘భారత్‌కు స్వాగతం పుతిన్‌. భారత్‌–రష్యాల స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చే మన చర్చల కోసం వేచి చూస్తున్నా’ అని పేర్కొన్నారు.

మోదీ, పుతిన్‌ ఏకాంతంగా విందు ఆరగిస్తూ ద్వైపాక్షిక సహకారం సహా పలు అంశాలపై మాట్లాడుకున్నారని ఓ అధికారి చెప్పారు. 19వ భారత్‌–రష్యా ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరగనుంది. రక్షణ రంగంలో సహకారం, ఇరాన్‌ నుంచి ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు, ఎస్‌–400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థపై ఒప్పందం, ఉగ్రవాదంపై పోరు, పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై మోదీ, పుతిన్‌లు చర్చించే అవకాశం ఉంది.

5 బిలియన్‌ డాలర్ల విలువైన ఎస్‌–400 ట్రయంఫ్‌ క్షిపణులను రష్యా నుంచి కొనుగోలు చేసే ఒప్పందం శుక్రవారం దాదాపుగా ఖరారవనుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే రష్యా నుంచి ఎవరూ ఆయుధాలు కొనకూడదంటూ ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది. అవసరమైనప్పుడు ప్రతేకంగా ఏదైనా దేశం కోసం ఈ ఆంక్షలను సడలించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ కు అధికారం ఉంది. ఆంక్షలున్నా సరే రష్యా నుంచి క్షిపణుల కొనుగోలుకే భారత్‌ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష, వాణి జ్య, ఇంధన, పర్యాటక తదిరత రంగాల్లో ఒప్పందాలు కూడా భారత్‌–రష్యామధ్య కుదిరే అవకాశం ఉంది.
 

Advertisement
Advertisement