ఇమ్రాన్‌కు బ్యాటు బహుమానం

PM Modi gifts cricket bat to Pakistan's PM Imran khan - Sakshi

ఖాన్‌తో భారత దౌత్యవేత్త భేటీ

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా కాబోయే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపైనా వీరిద్దరు చర్చించారు. సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లు తదితర అంశాలపై ఇమ్రాన్‌ వద్ద అజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ చీఫ్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున అజయ్‌ అభినందించారు. భారత క్రికెట్‌ జట్టు సంతకాలు చేసిన బ్యాట్‌ను బహూకరించారు. భారత్‌–పాక్‌ చర్చలు మళ్లీ ప్రారంభం కావాలని ఇమ్రాన్‌ ఆకాంక్షించారు.

ఇస్లామాబాద్‌లో త్వరలో జరగనున్న సార్క్‌ సదస్సలో భారత్‌ పాల్గొనాలని కూడా ఆయన కోరారు. పాకిస్తాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పీటీఐ ప్రకటించింది. భారత క్రికెటర్లు కపిల్‌ దేవ్, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు, సునీల్‌ గావస్కర్‌లను ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొంది. ఆగస్టు 13 నుంచి పాక్‌ పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కాగా, పార్లమెంటు ఎన్నికల్లో బహిరంగంగా ఓటు వేసినందుకు పాక్‌ ఎన్నికల సంఘానికి ఇమ్రాన్‌ ఖాన్‌ క్షమాపణలు చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top