ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామన్న పాక్‌

Pakistan to take action on terrorists - Sakshi

హామీ ఇచ్చినట్లు తెలిపిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు 

వాషింగ్టన్‌: తమ భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్‌ చెప్పింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పాక్‌ హామీ ఇచ్చినట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ వెల్లడించారు. సోమవారం పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా  ఖురేషీ ఫోన్‌లో ఈ విషయం చెప్పినట్లు తెలిపారు. ‘పాకిస్తాన్‌ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహమ్మద్, ఇతర ఉగ్రసంస్థలపై సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఖురేషీతో ఫోన్‌లో చెప్పాను’అని బోల్టన్‌ తెలిపారు.

జైషే పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత ఉపఖండంలో తాజాగా జరిగిన పలు పరిణామాలపై వివరించేందుకు జాన్‌ బోల్టన్‌కు ఫోన్‌ చేసినట్లు పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. శాంతి, సుస్థిరతను పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కోరుకుంటున్నారని, అందుకే ఐఏఎఫ్‌ పైలట్‌ను భారత్‌కు అప్పగించినట్లు ఖురేషీ వివరించినట్లు బోల్టన్‌ తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top