‘ఆ నీళ్లు ఇవ్వకపోయినా ఇబ్బందేం లేదు’

Pakistan Said Not Concerned If India Diverts Water From 3 Eastern Rivers - Sakshi

ఇస్లామాబాద్‌ : పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ చుట్టూ భారత్‌ ఉచ్చు బిగుస్తోంది. సింధూ నదీ జలాల ఒప్పందంలో భాగంగా పాక్‌కు వెళ్తున్న తన నీటి వాటాను నిలిపివేయాలని భారత్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెచ్చరికలను పాక్‌ పట్టించుకోవడం లేదు. నీళ్లు ఇచ్చినా.. ఇవ్వకపోయినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని పాకిస్తాన్‌ తెలిపినట్లు సమాచారం.

ఈ విషయం గురించి పాకిస్తాన్‌ నీటి వనరుల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాయిల్‌ మాట్లాడుతూ.. ‘సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు నదుల్లో మూడు నదులపై పాకిస్తాన్‌కు, మరో మూడు నదులపై ఇండియాకు హక్కులు ఉన్నాయి. మూడు పశ్చిమ నదులు సింధు, జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు.. మూడు తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్‌పై భారత్‌కు హక్కులున్నాయి. అయితే భారత్‌కు హక్కులున్న నదుల్లో మిగులు నీరు పాకిస్తాన్‌కు వెళ్తున్నది. ఇప్పుడు ఈ జలాలను జమ్ముకశ్మీర్ ప్రజలకు ఇస్తామని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే తూర్పు నదులైన బియాస్‌, రావి, సట్లెజ్‌ నీటిని భారత్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మాకు నష్టం లేదు’ అని ఆయన అన్నారు.(పాక్‌పై జలఖడ్గం)

అంతేకాక ‘ఈ జలాల విషయమై మాకు ఆందోళనగానీ, అభ్యంతరంగానీ ఏమీ లేదు. ఆ నదుల్లోని నీటిని అక్కడి ప్రజలకు ఇచ్చుకోవచ్చు. సింధూ నదీ జలాల ఒప్పందం కూడా అందుకు అనుమతి ఇచ్చింది’ అని స్పష్టం చేశారు. అయితే తమకు హక్కులున్న పశ్చిమ నదులు చీనాబ్, సింధు, జీలం నదుల్లోని నీటిని మళ్లిస్తే మాత్రం తమ అభ్యంతరాలను లేవనెత్తుతామ’ని ఆయన తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top