బంధానికి ఆంక్షలు అడ్డుకావు

Narendra Modi launches Act Far East Policy for Russia - Sakshi

భారత్‌–రష్యా బంధంలో నవ శకం

ఈఈఎఫ్‌ ఫోరంలో మోదీ

వ్లాడివోస్టోక్‌: రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్‌–రష్యాల, వ్యూహాత్మకమైన ఇంధనం, రక్షణ రంగాలు, ఇరుదేశాల బంధంపై ఉండబోదని ప్రధాని మోదీ అన్నారు. ‘భారత్‌ కంపెనీలు రష్యాలోని ఆయిల్, గ్యాస్‌ రంగాల్లోనూ, రష్యా సంస్థలు భారత్‌లోని ఇంధనం, రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై పెట్టుబడులు పెట్టాయన్నారు.  వీటిపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు అడ్డంకిగా మారబోవు’ అని తెలిపారు. క్రిమియా కలిపేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీటి ప్రభావం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపైనా పడుతోంది.

టాల్‌స్టాయ్‌– గాంధీజీ స్నేహమే స్ఫూర్తి
ప్రముఖ రష్యా రచయిత, తత్వవేత్త లియో టాల్‌స్టాయ్, గాంధీజీల మైత్రి వారిద్దరిపైనా చెరగని ముద్ర వేసిందని ప్రధాని మోదీ అన్నారు. టాల్‌స్టాయ్‌ రాసిన ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఈజ్‌ వితిన్‌ యూ’ పుస్తకం తన జీవితాన్ని మార్చివేసిందని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారని మోదీ తెలిపారు. వారి స్నేహం స్ఫూర్తిగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో రెండు దేశాలు పరస్పరం కీలక వాటాదారులు కావాలన్నారు.

వ్లాడివోస్టోక్‌లో జరుగుతున్న 5వ ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరం(ఈఈఎఫ్‌) ప్లీనరీలో ప్రధాని గురువారం మాట్లాడారు. ‘రష్యా తూర్పు ప్రాంతాన్ని పెట్టుబడులకు వేదికగా భావిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి అధ్యక్షుడు పుతిన్‌ చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఉంటాం’అని తెలిపారు. ‘రష్యా తూర్పు ప్రాంత అభివృద్ధికి రూ.7వేల కోట్లను భారత్‌ రుణంగా అందజేయనుంది. మరో దేశానికి భారత్‌ ఇలా రుణం ఇవ్వడం ‘ఒక ప్రత్యేక సందర్భం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ‘యాక్ట్‌ ఫార్‌ ఈస్ట్‌’ విధానాన్ని ఆవిష్కరించారు. ఈఈఎఫ్‌ వేదికగా రూ.36 వేల కోట్ల విలువైన 50 ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు.

సమ్మిళిత ‘ఇండో–పసిఫిక్‌’ ప్రాంతం
భారత్, రష్యాల మధ్య బలపడిన మైత్రితో ఇండో–పసిఫిక్‌ ప్రాంతాన్ని ‘ఆటంకాలు లేని, స్వేచ్ఛాయుత, సమ్మిళిత’ ప్రాంతంగా మార్చే నూతన శకం ప్రారంభమైందన్నారు. ‘ఈ విధానం నిబంధనలను, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడంతో పాటు, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు. చైనా ఈ ప్రాంతంలో సైనిక బలం పెంచుకోవడం, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై తమదే పెత్తనమనడంపై మోదీ పైవిధంగా మాట్లాడారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top