ఫేస్‌బుక్‌లో మైనర్‌ బాలిక వేలం..

Minor Girl Auctioned on Facebook - Sakshi

తొలగించిన ఫేస్‌బుక్‌ యాజమాన్యం

ఆ లోపే జరిగిపోయిన పెళ్లి

దక్షిణ సూడాన్‌లో వెలుగు చూసిన ఘటన

దక్షిణ సూడాన్‌: పదహారేళ్ల మైనర్‌ బాలికను ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా వేలానికి ఉంచి, పెళ్లి చేసిన అమానవీయ ఘటన దక్షిణ సూడాన్‌లో వెలుగు చూసింది. ఆ మైనర్‌ను పెళ్లి చేసుకోవడానికి డబ్బు చెల్లించమని చెబుతున్న వీడియో ఫేస్‌బుక్‌లో అక్టోబర్‌ 25 నుంచి పదిహేను రోజుల పాటు వైరల్‌ అయింది. దీనిని గమనించిన ఫేస్‌బుక్‌ యాజమాన్యం ఈ నెల 9న ఆ యూజర్‌ ఐడీని బ్లాక్‌ చేసి వీడియోని తొలగించినప్పటికీ ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నెల 3న ఆ బాలికకు పెళ్లి జరిగిపోయింది.

ఈ విషయంపై ఫేస్‌బుక్‌ ప్రతినిథి ఒకరు ప్రముఖ వార్తా సంస్థ సిఎన్‌ఎన్‌తో స్పందిస్తూ, అమానవీయతను, అక్రమాన్ని ప్రదర్శించే చర్యలను ఫేస్‌బుక్‌ అనుమతించదని తెలిపారు. తమ కంపెనీ పాలసీలను ధిక్కరించే పోస్ట్‌లను గుర్తించడానికి 30 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నామని తెలిపారు. మైనర్‌ బాలిక వేలానికి పాల్పడిన వ్యక్తి యూజర్‌ ఐడీని బ్లాక్‌ చేశామని తెలిపారు.

యూనిసెఫ్‌ 2017 గణాంకాల ప్రకారం సూడాన్‌లో 52 శాతం మందికి పద్దెనిమిదేళ్లు నిండకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ‘సూడాన్‌లో బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు సహజంగానే ఎక్కువ. టెక్నాలజీ సహాయంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంద’ని మానవ హక్కుల కార్యకర్త ఒకరు అన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top