నక్షత్రం పేలితే... వాన కురుస్తుంది! | Link to the stars for rains | Sakshi
Sakshi News home page

నక్షత్రం పేలితే... వాన కురుస్తుంది!

Dec 31 2017 2:30 AM | Updated on Dec 31 2017 8:17 AM

Link to the stars for rains - Sakshi

‘‘నదులు, సముద్రాల్లోని నీరు ఆవిరై ఆకాశానికి చేరితే మేఘం ఏర్పడుతుంది.. తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మేఘం కాస్తా వానగా మళ్లీ భూమిని చేరుతుంది’’.   చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న విషయం ఇదే. బాగానే ఉందిగానీ.. మరి ‘తగిన’పరిస్థితులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి?   ఈ సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా? డెన్మార్క్‌ శాస్త్రవేత్తలిప్పుడు దీనికో ఆశ్చర్యకరమైన కారణం కనిపెట్టారు. ప్రకృతి గురించి మనకంతా తెలుసుఅనుకునే వారు కూడా ముక్కున వేలేసుకునే ఆ వివరాలేమిటో చూసేయండి మరి!


రాత్రిళ్లు ఆకాశానికేసి చూస్తే బోలెడన్ని నక్షత్రాలు కనిపిస్తాయి కదా... వీటిల్లో కొన్ని తమలోని ఇంధనం ఖర్చయిపోవడం వల్ల ఢామ్మని పేలిపోతుంటాయి. సూపర్‌ నోవా అని పిలిచే ఈ పేలుళ్ల కారణంగా భారీ మొత్తంలో కాస్మిక్‌ కిరణాలూ వెలువడుతుంటాయి. కోటానుకోట్ల మైళ్ల దూరాలు దాటుకుని భూమిని చేరే ఈ కిరణాలు వాతావరణం పైపొరల్లో మేఘాలు ఏర్పడేందుకు ‘తగిన’పరిస్థితులు కల్పిస్తుంటాయని డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం.

చల్లటి నీళ్లు ఉన్న గాజుగ్లాసును కాసేపు అలాగే ఉంచితే..గోడలపై గాల్లోని ఆవిరి కాస్తా నీరుగా మారడం మనం గమనించే ఉంటాం. అచ్చం ఇలాంటి ప్రక్రియే ఆకాశంలోనూ జరుగుతుంది. కాకపోతే గాజు గ్లాసుకు బదులుగా అక్కడ ఏరోసాల్స్‌ ఉంటాయి. దుమ్మూ, ధూళితోపాటు అనేక రకాల రసాయనాల సూక్ష్మ కణాలనే ఏరోసాల్స్‌ అంటారు. వీటిల్లో కొన్నింటికి పరిసరాల్లోని నీటి ఆవిరిని ఆకర్షించే ప్రత్యేక లక్షణముంటుంది. ఇవే విత్తనాల మాదిరిగా వ్యవహరించి.. మేఘమనే చెట్టు ఎదిగేలా చేస్తాయి. విత్తనాలు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ మేఘాలు ఏర్పడతాయి.

అందుకు తగ్గట్టుగానే వానలూ పడతాయన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సూపర్‌నోవాల కారణంగా వెలువడే కాస్మిక్‌ కిరణాలు వాతావరణం పై పొరల్లో చేసే కొన్ని మార్పుల కారణంగా ఏరోసాల్స్‌ అధిక మోతాదులో విత్తనాలుగా మారతాయని డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి ఆవిరితో కూడిన గాజు చాంబర్‌పైకి కాస్మిక్‌ కిరణాలను ప్రయోగించినప్పుడు ఆవిరి కాస్తా ద్రవంగా మారడం ఎక్కువైందని.. దాదాపు వందసార్లు ఇదే ప్రయోగాన్ని పునరావృతం చేసి.. ఒకే రకమైన ఫలితాలు సాధించామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

సూర్యుడూ కారణమే...
వాతావరణం పై పొరలను తాకే కాస్మిక్‌ కిరణాల మోతాదు మన సూర్యుడిపై చర్యల ఆధారంగా ఉంటాయని డెన్మార్క్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు దశాబ్ద కాలంపాటు సూర్యుడిపై పేలుళ్లు పెరగడం.. ఆ తరువాత పదేళ్లు తగ్గుతుండటం మనకు తెలిసిందే. దీని కారణంగా సూర్యుడి విద్యుదయస్కాంత క్షేత్ర తీవ్రతలోనూ తేడాలొస్తాయి. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కాస్మిక్‌ కిరణాలు మేఘాలున్న ప్రాంతానికి చేరతాయి... ఎక్కువైనప్పుడు తక్కువవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇంకోలా చెప్పాలంటే భూమ్మీద పదేళ్లపాటు మేఘాలు ఏర్పడటం కొంచెం ఎక్కువగా ఉండి.. ఉష్ణోగ్రతలు పడిపోతే... మరో పదేళ్లపాటు పెరుగుతూ ఉంటాయన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అతితక్కువ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 2008 నుంచి సూర్యుడిపై పేలుళ్ల వంటివి క్రమేపీ మందగిస్తున్నట్లు నాసా రికార్డులు చెబుతుండటం ఇక్కడ గమనార్హం.  

ఏమిటి దీని ప్రాముఖ్యత?
నక్షత్రాల పేలుళ్లు... సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీవ్రతలకు.. మేఘాలు ఏర్పడేందుకు మధ్య సంబంధం ఉందన్నది ఇప్పటివరకూ తెలియని విషయం. చరిత్రను తిరగేసినా.. సూర్యుడిపై చర్యలకు అనుగుణంగానే భూమ్మీద ఉష్ణోగ్రతలు, వానల్లో మార్పులు వచ్చిన విషయం స్పష్టమవుతుంది.

మానవ చర్యల కారణంగా భూమి క్రమేపీ వేడెక్కుతోందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి ఇది 3.6 డిగ్రీలకు చేరుకుని వాతావరణ మార్పులతో మానవ మనుగడ కష్టమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో డెన్మార్క్‌ శాస్త్రవేత్తల ప్రయోగానికి ప్రాముఖ్యత ఏర్పడింది. గత పదివేల ఏళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల కంటే ఎక్కువ స్థాయికి చేరుకున్న సందర్భాలు అనేకమున్నాయని.. ఇవన్నీ సూర్యుడిపై జరిగే చర్యలు.. తద్వారా కాస్మిక్‌ కిరణాల మోతాదుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్లనేనని వీరు అంచనా వేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో?

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement