జ్యోతి కుమారి నిజంగా అద్భుతం : ఇవాంక

Ivanka Trump Comments On Bihar Girl Cycling 1200 Km With Father - Sakshi

న్యూయార్క్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో హర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బాలిక జ్యోతి కుమారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు, ఆయన కూతురు ఇవాంక ట్రంప్‌ జ్యోతిని మెచ్చుకున్నారు. 15 ఏళ్ల జ్యోతి కుమారి చేసిన సాహసం అద్భుతమని ట్విటర్‌ వేదికగా కొనియాడారు.
(లాక్‌డౌన్‌ : 1200 కి.మీ దాటి సైకిల్‌పై స్వగ్రామానికి..)

ఈ మేరకు ఇవాంక ట్రంప్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. ' 15 ఏళ్ల జ్యోతి కుమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకొని ఏడు రోజుల పాటు 1200 వందల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అత్యంత అద్భుతమనే చెప్పాలి. భారతీయ ప్రజలో​ ఇంత ఓర్పు, సహనం, ప్రేమ  ఉంటాయనేది ఈమె ద్వారా నాకు తెలిసింది. ఇది కేవలం నన్ను మాత్రమే గాక సైక్లింగ్‌ ఫెడరేషన్‌ను ఆకర్షించిందంటూ' ట్వీట్‌ చేశారు. ఇవాంక చేసిన ట్వీట్‌పై జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ.. లాక్‌డౌన్‌ వేళ ప్రభుత్వం విఫలమైన వేళ ఆమె పేదరికం, తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయం జ్యోతిని 1200 కి.మీ సైకిల్‌ తొక్కేలా చేసిందంటూ పేర్కొన్నారు.


మే 10న గురుగ్రామ్‌ నుంచి ప్రారంభమైన జ్యోతి ప్రయాణం మే 16న తన సొంతూరైన దర్భంగాకు చేరుకోవడంతో ముగిసింది. ప్రస్తుతం వీరిద్దరు క్వారంటైన్‌ సెంటర్లో ఉన్నారు. అయితే దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త  సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దృష్టిలో పడింది. ఏకంగా జ్యోతి కుమారికి  సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ట్రయల్స్‌కు రమ్మని పిలుపువచ్చింది. '1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమెలో అసాధ్యమైన ప్రతిభ ఉంది. ఏడు లేదా ఎనిమిది ప్రమాణాలను తాను దాటితే.. తను జాతీయ జట్టులోకి ఎంపిక అవుతుంది. అంతేకాక.. ట్రైనింగ్ సమయంలో తను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు' అని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top