అది అథ్లెట్లకూ సాధ్యం కాని ఫీట్‌.. | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ : 1200 కి.మీ దాటి సైకిల్‌పై స్వగ్రామానికి..

Published Wed, May 20 2020 7:31 PM

Girl Brings Father From Gurugram To Bihar On Bicycle - Sakshi

పట్నా : ప్రొఫెషనల్‌ అథ్లెట్లూ సాహసించని కార్యాన్ని 15 ఏళ్ల బాలిక తలకెత్తుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చోపెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించిన బాలిక జ్యోతి కుమారిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుదీర్ఘ సైకిల్‌ ప్రయాణంతో తమ ఊరు సింగ్వారాకు చేరుకున్న తండ్రీకూతుళ్లు ప్రస్తుతం గ్రామ శివార్లోని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్నారు. ఈ-రిక్షాను నడిపే కుమారి తండ్రి పాశ్వాన్‌ కొద్దిరోజుల కిందట ప్రమాదానికి గురవడంతో పని చేసే సత్తువ కోల్పోయాడు.

ఈ-రిక్షాను కిరాయికి ఇచ్చిన యజమాని కొద్దినెలలుగా బకాయిపడిన అద్దెను చెల్లించాలని లేకుంటే ఇక్కడనుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడని పాశ్వాన్‌ చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తాను ఏదో ఒక పని చేసి అద్దె చెల్లిస్తానని పలుమార్లు చెప్పానని, ఇప్పుడు తాను వేసుకోవాల్సిన మందులను విరమించుకుంటే ఒక పూట తినగలుగుతున్నామని, ఈ పరిస్ధితిలో రెంట్‌కు డబ్బు ఎక్కడనుంచి తేగలమని ప్రశ్నించాడు. లాక్‌డౌన్‌ మరింత పొడిగించడంతో యజమాని నుంచి ఇబ్బందులు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో కూతురు జ్యోతి గ్రామానికి తిరిగి వెళదామని పట్టుపట్టిందని చెప్పాడు. సైకిల్‌పై అంత దూరం వెళ్లడం కష్టమని చెప్పినా జ్యోతి పట్టువిడవలేదని తెలిపాడు. తాము రోజుకు 30 నుంచి 40 కిమీ సైకిల్‌పై ప్రయాణించామని, కొన్ని ప్రాంతాల్లో ట్రక్‌ డ్రైవర్లు తమకు లిఫ్ట్‌ ఇచ్చారని జ్యోతి గుర్తుచేసుకుంది. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఇల్లు చేరామని సంతోషపడింది. సైకిల్‌పై తండ్రిని ఎక్కించుకుని సుదీర్ఘ ప్రయాణంతో స్వగ్రామానికి చేరుకున్న జ్యోతి కుమారి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

చదవండి : లాక్‌డౌన్‌ ఎత్తివేత; నా ఆనందం ఇలాగే ఉంటుంది

Advertisement
Advertisement