ఇరాన్‌లో నిరసన డ్యాన్స్‌ల వెల్లువ

Iranian Women Protesting By Dancing On The Streets - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇరాన్‌లో ఇటీవల 18 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి మేదేహ్‌ హోజాబ్రి తాను డ్యాన్స్‌ చేసిన వీడియోలను ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో అప్‌లోడ్‌ చేసినందుకు ఇరాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ సంఘటన ఓ ఉద్యమానికే ఊపిరిపోసింది. టీనేజ్‌ అమ్మాయి అరెస్ట్‌ను నిరసిస్తూ ఇరానీ మహిళలు ఇళ్లలో వీధి కూడళ్లలో డ్యాన్స్‌ చేస్తున్నారు. వాటి వీడియోలను ‘డాన్సింగ్‌ఈజ్‌నాట్‌క్రైమ్‌’, డాన్సింగ్‌టుఫ్రీడమ్‌’ హాష్‌ ట్యాగ్‌లతో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఇలా వీడియోలను అప్‌లోడ్‌ చేసిన ఒకరిద్దురు మహిళలను ముందుగా అరెస్ట్‌ చేసిన పోలీసులు, పుంఖానుపుంఖంగా వచ్చి పడుతున్న వీడియోలను చూసి ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇరానీ మహిళలు తమ ఇళ్లలో, ఇంటి ముందు బ్యాక్‌ గ్రౌండ్‌కు మ్యూజిక్‌ అనుగుణంగా డ్యాన్సులు చేస్తున్నారు. వాటిని వీడియోలుగా చిత్రీకరిస్తున్నారు. ఇక వీధి కూడళ్లలో అయితే మగవాళ్ల కచేరి వాయిద్యాల మధ్య మహిళలు నృత్యం చేస్తున్నారు. కొన్ని చోట్ల మగవాళ్లు ఆడవాళ్ల డ్యాన్సులకు మద్దతుగా చిన్నపాటి ఉపన్యాసాలు కూడా ఇచ్చి మహిళలను ప్రోత్సహిస్తున్నారు.

డ్యాన్స్‌ వీడియోల కారణంగా అరెస్టయిన ఇరానీ టీనేజ్‌ అమ్మాయికి మద్దతుగా ఇప్పటికే బ్రిటీష్‌ మహిళలు డాన్స్‌ వీడియోలను బీబీసీకి పంపిస్తున్నారు. బీబీసీ వారు వాటిని ప్లే చేస్తున్నారు. డ్యాన్స్‌ చేస్తే ఇరానీ అమ్మాయిలను అరెస్ట్‌ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఓ పాటకు డ్యాన్స్‌ చేసి ఆ వీడియోలను పోస్ట్‌ చేసిన ఆరుగురు మహిళలను 2014లో మొదటిసారి ఇరానీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలు డ్యాన్స్‌ చేయడం కుసంస్కారం, చట్ట విరుద్ధ చర్య అన్నది పోలీసుల వాదన. అప్పుడు కూడా అరెస్ట్‌లకు నిరసనగా పలువురు మహిళలు డ్యాన్స్‌ చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top