భారత సంతతి వ్యక్తికి అరుదైన పురస్కారం

Indian-origin Akshay Venkatesh Gets Fields Medal - Sakshi

న్యూయార్క్‌ : ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తిని ప్రతిష్టాత్మక ‘ఫీల్డ్స్‌’ మెడల్‌ వరించింది. ఇండో - ఆస్ట్రేలియన్‌ అయిన అక్షయ్‌ వెంకటేష్‌ ఈ అరుదైన ఘనత సాధించారు. గణిత శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఫీల్డ్స్‌ మెడల్‌’ను బహుకరిస్తారు. దీన్ని గణిత శాస్త్ర రంగంలో నోబెల్‌గా భావిస్తారు.  ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే ఈ పురస్కారం ఈ సారి భారత సంతతి వ్యక్తి అక్షయ్‌ను వరించింది.

ఈ అరుదైన పురస్కారాన్ని అక్షయ్‌ మరో నలుగురితో కలిసి పంచుకునున్నారు. ఈ అవార్డు అందుకున్న వారిలో కచేర్ బిర్కర్(ఇరానీయన్‌ కుర్దిషియ్‌, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు), పీటర్‌ స్కాల్జ్‌ (జర్మనికి చెందిన వ్యక్తి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ బాన్‌ అండ్‌ అలెస్సియో ఫిగల్లిలో ప్రొఫెసర్‌), మరో ఇటాలియన్‌ మ్యాథమేటిషియన్‌లు ఉన్నారు. వీరితో కలిసి అక్షయ్‌ బ్రెజిల్‌లోని రియో డీ జెనిరాలో ఉన్న ‘ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ మ్యాథమేటిషియన్స్‌’లో బుధవారం (నిన్న) నాడు ఈ అవార్డును అందుకున్నారు. దీంతో పాటు ప్రతి ఒక్కరు 15 వేల కెనడియన్‌ డాలర్ల(ఇండియన్‌ కరెన్సీలో 7, 88, 358 రూపాయలు) విలువైన ప్రైజ్‌ మనీని గెలుచుకున్నారు.

న్యూఢిల్లీలో జన్మించిన అక్షయ్‌(36) రెండేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా, పెర్త్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో మ్యాథ్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అక్షయ్‌కు భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రలంటే చాలా ఇష్టం. ఇప్పటికే గణిత శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను పలు అవార్డులు అందుకున్నారు.

1924 టొరంటోలో జరిగిన మ్యాథ్య్‌ కాంగ్రెస్‌లో భాగంగా కెనడియన్‌ గణితశాస్త్రవేత్త జాన్‌ చార్లెస్‌ ఫీల్డ్‌ అభ్యర్ధన మేరకు 1932లో ఫీల్డ్‌ మెడల్‌ను ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి గణిత శాస్త్రరంగంలో అపార కృషి చేసిన వారికి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. నలభై ఏళ్లలోపు ఉన్న వారికి మాత్రమే దీన్ని ఇవ్వడం ఆనవాయితి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top