
బీజేపీ నేత, తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు చేదు అనుభవం ఎదురైంది. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన నుంచి మెడల్ స్వీకరించేందుకు ఓ యువకుడు నిరాకరించాడు. తీరా ఆ యువకుడు ఆ రాష్ట్ర మంత్రి కొడుకు కావడం గమనార్హం.
తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా తనయుడు సూర్య రాజా బాలు చేసిన పని ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశమైంది. మాజీ ఐపీఎస్ అన్నామలై నుంచి మెడల్‌ను నిరాకరించాడు. తమిళనాడు 51వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలకు అన్నామలై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విజేతల మెడలో మెడల్స్ వేస్తుండగా.. సూర్య అందుకు ఒప్పుకోలేదు. అన్నామలై నుంచి దూరందూరంగా జరిగాడు. ఆపై అన్నామలై నుంచి చేత్తో ఆ మెడల్‌ను తీసుకున్నాడు.
அசிங்கப்பட்டான் ஆடு மேய்ப்பன் @annamalai_k pic.twitter.com/19l5XerZfH
— ஜோக்கர் ᵖʰᵒᵉⁿⁱˣ (@lahudapandi) August 25, 2025
అయితే ఈ పరిణామంపై అన్నామలై ఏమాత్రం అసహనం వ్యక్తం చేయలేదు. బాలును దగ్గరికి తీసుకుని సక్సెస్ కావాలంటూ అభినందించి ఫొటో దిగారు. ఆపై ఈ వీడియో వైరల్ అయ్యింది. ఓ ఈవెంట్‌కు హాజరైన మీడియా నుంచి ఆయనకు వైరల్ వీడియోపై ప్రశ్న ఎదురైంది. దానికి అన్నామలై స్పందిస్తూ.. నేత అనేవాడు ప్రజలతో ప్రేమాభిమానాలతో ఉండాలిగానీ ద్వేషంతో కాదు అని బుదులిచ్చారు. బాలుకు విజయాలు కలగాలి అంటూ మరోసారి ఆశీర్వదించారు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.
అన్నామలై 2011 బ్యాచ్‌కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. సింగంగా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఈమధ్యే ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అయినప్పటికీ నిత్యం ఆయన స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో కనిపిస్తున్నారు.
మొన్నీమధ్యే తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి ఇదే తరహా అనుభవం ఎదురైంది. తిరునెల్వేలిలో ఓ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆయన హాజరు కాగా.. ఆయన నుంచి కాకుండా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నుంచి ఓ యువతి పట్టా అందుకుంది. డీఎంకే నేత ఎం రాజన్ తనయ జీన్ జోసెఫ్‌గా తేలింది. గవర్నర్ తమిళ భాషకు, తమిళనాడుకు వ్యతిరేకి అని.. పైగా వైస్ చాన్సలర్ తమిళనాడుకు ఎంతో చేశారని.. అందుకే ఆయన నుంచి పట్టా తీసుకున్నానని జీన్ తెలిపింది.